Indore Test: మూడో టెస్టులో భారత్ పతనాన్ని శాసించింది అదే: గవాస్కర్
ABN , First Publish Date - 2023-03-03T20:06:45+05:30 IST
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఇక్కడి హోల్కార్ క్రికెట్
ఇండోర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఇక్కడి హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు చిత్తుగా ఓడించింది. టీమిండియా నిర్దేశించిన 76 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా(Australia) ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) వేసిన నోబాలే టర్నింగ్ పాయింటని, అదే జట్టు కొంపముంచిందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగులో మార్నస్ లబుషేన్( Marnus Labuschagne) అవుటయ్యాడు. అప్పటికి అతడు ఖాతా తెరవలేదు. అయితే, జడేజా వేసిన ఆ బంతి నోబాల్ కావడంతో లబుషేన్ గండం నుంచి గట్టెక్కాడు. ఆ తర్వాత అతడు క్రీజులో నిలదొక్కుకుని 31 పరుగులు చేశాడు. అంతేకాదు, ఉస్మాన్ ఖావాజాతో కలిసి రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
భారత ఓటమికి ఇక్కడే బీజం పడిందని గవాస్కర్(Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు. జడేజా విసిరిన ఆ బంతి నోబాల్ కాకపోయి ఉంటే లుబుషేన్ డకౌట్ అయ్యేవాడని అన్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పింది ఇదేనని పేర్కొన్నాడు. తన అభిప్రాయం ప్రకారం ఆ నోబాల్ భారత పతనాన్ని శాసించిందన్నాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్థానాన్ని పదిలం చేసుకుంది.
భారత గడ్డపై పర్యాటక జట్టలు విజయం సాధించడం చాలా అరుదు. ఈ విషయంలో ఆస్ట్రేలియా కూడా భిన్నం కాదు. కానీ ఇప్పుడు ఇండియాను ఓడించి ఆరేళ్ల తర్వాత భారత గడ్డపై విజయాన్ని నమోదు చేసింది. గత పదేళ్లలో సొంతగడ్డపై భారత్‌కు ఇది మూడో పరాజయం.