Asia Cup 2023: రాహుల్, అయ్యర్ వచ్చేశారు.. ఇద్దరు తెలుగోళ్లకు అవకాశం

ABN , First Publish Date - 2023-08-21T14:23:07+05:30 IST

ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్ 2023 కోసం బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. చాలా కాలం పాటు గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. అంతేకాకుండా తొలిసారి ఇద్దరు తెలుగు కుర్రాళ్లకు కూడా సెలక్టర్లు అవకాశం కల్పించారు.

Asia Cup 2023: రాహుల్, అయ్యర్ వచ్చేశారు.. ఇద్దరు తెలుగోళ్లకు అవకాశం

ఆసియా కప్ 2023కి టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మొత్తం 17 మంది సభ్యులతో టీమ్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా చాలా కాలం పాటు గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. అంతేకాకుండా తొలిసారి ఇద్దరు తెలుగు కుర్రాళ్లకు కూడా సెలక్టర్లు అవకాశం కల్పించారు. హైదరాబాద్ సంచలన బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన తిలక్ వర్మకు జట్టులో స్థానం లభించింది.

ఇది కూడా చదవండి: HCA: హైదరాబాద్‌లో వరుస మ్యాచ్‌లంటే కష్టమే!

అందరూ ఊహించిన రీతిలో ఓపెనర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌ ఎంపికయ్యారు. మిడిలార్డర్ కోసం విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌కు చోటు లభించింది. పేస్ బౌలర్ల కోటాలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక కాగా.. స్పిన్ బౌలర్ల కోటాలో కుల్‌దీప్ యాదవ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్న స్పెషలిస్ట్ స్పిన్నర్ చాహల్‌కు మాత్రం నిరాశ మిగిలింది. అయితే ఈ 17 మందితో పాటు స్టాండ్ బైగా వికెట్ కీపర్ సంజు శాంసన్‌ను కూడా సెలక్టర్లు ప్రకటించడం గమనించాల్సిన విషయం. కాగా ఆసియా కప్ ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది.

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (స్టాండ్ బై)

Updated Date - 2023-08-21T14:24:37+05:30 IST