India vs Sri Lanka: షనక అద్భుత ఇన్నింగ్స్ వృథా.. భారత్ ఘన విజయం
ABN , First Publish Date - 2023-01-10T21:33:36+05:30 IST
శ్రీలంక(Sri Lanka)తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు (Team India) 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో
గువాహటి: శ్రీలంక(Sri Lanka)తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు (Team India) 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి పరాజయం పాలైంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు ఆరంభం కలిసి రాలేదు. 19 పరుగుల వద్ద అవిష్క ఫెర్నాండో (5) వికెట్‌ను కోల్పోయిన లంక.. 23 పరుగుల వద్ద రెండో వికెట్, 64 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ పాథుమ్ నిశ్శంక (Pathum Nissanka) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. సహచరులందరూ ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా అతడు మాత్రం భారత బౌలర్లను ఎదురొడ్డి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో 11 ఫోర్లతో 72 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న నిశ్శంకను ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) వెనక్కి పంపాడు. చరిత్ అసలంక 23 పరుగులు చేయగా, ధనంజయ డి సిల్వా 47 పరుగులు చేసి అవుటయ్యాడు.
మరోవైపు, లంక కెప్టెన్ దాసున్ షనక (Dasun Shanaka) మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అప్పటికే టాపార్డర్ పెవిలియన్ చేరడం, సాధించాల్సిన పరుగులు, ఉన్న బంతులకు మధ్య అంతరాయం భారీగా ఉండడంతో భారత్ విజయం ఖాయమైపోయింది. దీంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా నిరాశే ఎదురైంది. తొలుత నిదానంగా ఆడిన షనక ఆ తర్వాత జోరు పెంచాడు. టీమిండియా బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కొంటూ వికెట్‌ను కాపాడుకుంటూనే పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయ సెంచరీ (108) సాధించాడు. మరోవైపు, 206 పరుగులకే 8 వికెట్లు పడగొట్టిన బౌలర్లు.. ఆ తర్వాత 100 పరుగులు సమర్పించుకున్నా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-0తో భారత్ శుభారంభం చేసింది.
అంతకుముందు టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. మాజీ సారథి విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ (113) పరుగులు సాధించి కెరియర్‌లో 45వ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 83 పరుగులు చేసి సెంచరీ ముంగిట అవుటయ్యాడు. శుభమన్ గిల్ 70, శ్రేయాస్ అయ్యర్ 28, కేఎల్ రాహుల్ 39, హార్దిక్ పాండ్యా 14 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కాసున్ రజిత 3 వికెట్లు పడగొట్టాడు.