ODI World Cup 2023: ఇదే ఆఖరి అవకాశం.. సెమీస్, ఫైనల్ టిక్కెట్లు కావాలంటే ఇలా చేయండి..!!
ABN , First Publish Date - 2023-11-09T18:48:25+05:30 IST
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ చివరి అవకాశాన్ని కల్పిస్తోంది. సెమీస్, ఫైనల్ లాంటి నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఈనెల 9న అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆయా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాలలో చూసి టీమిండియాకు మద్దతు తెలపాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీని ప్రత్యక్షంగా చూడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అయితే చాలా మందికి టిక్కెట్లు దొరక్కపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్థాన్ లాంటి మ్యాచ్ చూడాలని భావించినా అభిమానులకు టిక్కెట్లు దొరకలేదు. ఇప్పుడు మెగా టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ మేరకు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ చివరి అవకాశాన్ని కల్పిస్తోంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఈనెల 9న అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి నాకౌట్ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని.. ఔత్సాహికులు https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొనుగోలు చేయవచ్చని సూచించింది.
కాగా ఇప్పటికే సెమీఫైనల్‌కు సంబంధించి మూడు బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ బెర్తులను కైవసం చేసుకోగా.. మరో బెర్తు కోసం రెండు జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నీలో టీమిండియా ఖాతాలో 16 పాయింట్లు, దక్షిణాఫ్రికా ఖాతాలో 12 పాయింట్లు, ఆస్ట్రేలియా ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ ఈరోజు శ్రీలంకపై గెలిస్తే వాళ్ల ఖాతాలో 10 పాయింట్లు ఉంటాయి. పాకిస్థాన్‌తో పోలిస్తే న్యూజిలాండ్‌కు మెరుగైన రన్‌రేట్ ఉంది. దీంతో పాకిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ తేడాతో ఇంగ్లండ్‌పై గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఈనెల 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్, 16న కోల్‌కతా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.