Tilak Varma: ఆసియా కప్‌లో సత్తా చాటుతా.. రోహిత్ వల్లే ఇదంతా..!!

ABN , First Publish Date - 2023-08-22T15:48:09+05:30 IST

తన అంతర్జాతీయ క్రికెట్‌కు ముఖ్య కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని తిలక్ వర్మ వెల్లడించాడు. ఐపీఎల్ సమయంలో ఒత్తిడికి గురైన ప్రతీసారి రోహిత్ తనతో తరచూ మాట్లాడేవాడని.. మ్యాచ్ ఆడే సమయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాడు అని తెలిపాడు. అంతేకాకుండా ఎటువంటి సందేహాలు ఉన్నా తనను అడగాలని రోహిత్ చెప్పేవాడని తెలిపాడు.

Tilak Varma: ఆసియా కప్‌లో సత్తా చాటుతా.. రోహిత్ వల్లే ఇదంతా..!!

ఆసియా కప్ టీమిండియా స్క్వాడ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన సెలక్షన్ తిలక్ వర్మ మాత్రమే. ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడని తిలక్ వర్మను సెలక్టర్లు ఎంపిక చేయడం విస్మయానికి గురిచేసింది. వెస్టిండీస్ టూర్‌లో కేవలం టీ20లు మాత్రమే ఆడిన తిలక్ వర్మ మంచి ప్రదర్శన చేశాడు. కానీ ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఆసియా కప్ సెలక్షన్‌లో తిలక్ వర్మను పక్కన పెడతారని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. తిలక్ వర్మ ఎంపికను సాహసోపేత నిర్ణయంగా మాజీ కోచ్ టామ్ మూడీ కూడా అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: BCCI: వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు కుదరవు.. హెచ్‌సీఏకు స్పష్టం చేసిన బీసీసీఐ

ఈ నేపథ్యంలో తన ఎంపికపై తిలక్ వర్మ స్వయంగా స్పందించాడు. బీసీసీఐ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీ్కి ఎంపిక కావడంపై అతడు సంతోషం వ్యక్తం చేశాడు. తన చిన్ననాటి కల త్వరలోనే నెరవేరనుందని తెలిపాడు. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీతో వన్డేల్లో అరంగేట్రం చేస్తానని అసలు అనుకోలేదని తెలుగు తేజం చెప్పుకొచ్చాడు. ఎవరు ఎలా అనుకున్నా ఇది నాకు చాలా పెద్ద విషయం అని.. ఈ ఏడాదే అంతర్జాతీయ టీ20ల్లోకి డెబ్యూ చేశానని.. ఇప్పుడు నెల రోజులు కూడా తిరగకముందే ఆసియా కప్‌కు ఎంపిక చేశారని.. చాలా సంతోషంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు.


రోహిత్ వల్లే ఇదంతా..!!

తన కెరీర్ ముందుకు వెళ్లడానికి రోహిత్ చాలా మద్దతుగా నిలిచాడని తిలక్ వర్మ అన్నాడు. ఐపీఎల్ సమయంలో ఒత్తిడికి గురైన ప్రతీసారి రోహిత్ తనతో తరచూ మాట్లాడేవాడని.. మ్యాచ్ ఆడే సమయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాడు అని తెలిపాడు. అంతేకాకుండా ఎటువంటి సందేహాలు ఉన్నా తనను అడగాలని రోహిత్ చెప్పేవాడని తిలక్ వర్మ వెల్లడించాడు. రోహిత్ తనకు సపోర్ట్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేనని.. అతడి నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక్కడి వరకు వచ్చానంటే అది రోహిత్ భాయ్ వల్లేనని అభిప్రాయపడ్డాడు. తుది జట్టులో తనకు ఆడే అవకాశం వస్తే వన్డే క్రికెట్‌లో కచ్చితంగా సత్తా చాటుతానని తిలక్ వర్మ అన్నాడు. కాగా ఐర్లాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి తిలక్ వర్మ ఈనెల 24న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. అక్కడ స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొని ఆసియా కప్‌లోకి బరిలోకి దిగనున్నాడు.

కాగా ప్రస్తుతానికి ఆసియా కప్‌కు ప్రకటించిన 17 మంది ఆటగాళ్లలో ఒకడిగా తెలుగు తేజం తిలక్‌ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో అతడికి చోటు దక్కుతుందని మాత్రం కచ్చితంగా చెప్పలేం. కీలక ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు ప్రపంచకప్‌ ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండేలా చూడాలన్నది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయత్నం. శ్రేయాస్‌ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడని బీసీసీఐ పెద్దలు చెప్తున్నారు. ఒకవేళ ఫిట్‌నెస్‌ పరంగా ఆసియా కప్‌లో శ్రేయాస్, రాహుల్‌ ఇబ్బంది పడినా.. లయ అందుకోవడంలో తడబడినా అప్పుడు తిలక్‌ వర్మకు అవకాశం రావొచ్చు.

Updated Date - 2023-08-22T15:50:59+05:30 IST