Asia Cup 2023: శ్రీలంక జట్టుకు షాక్.. ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2023-08-25T17:33:35+05:30 IST

ఆసియా కప్ ప్రారంభానికి ముందు శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. శ్రీలంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్ కుశాల్ పెరీరాకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టీమ్ మేనేజ్‌మెంట్ వైద్య పరీక్షలు చేయించింది. అయితే వీళ్లిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో శ్రీలంక టీమ్ ఆందోళన పడుతోంది.

Asia Cup 2023: శ్రీలంక జట్టుకు షాక్.. ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్

క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్‌ ప్రారంభానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈనెల 30 నుంచి జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే ఆసియా కప్ ప్రారంభానికి ముందు శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కరోనా సంక్షోభానికి గురికావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఇటీవల కరోనా కేసులు భారీగా తగ్గిపోవడంతో నిబంధనలను తొలగించడం జరిగింది. దీంతో మ్యాచ్‌లు యధావిధిగా జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం శ్రీలంక క్రికెటర్లు కరోనా బారిన పడటంతో ఆసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Team India: విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే..?

శ్రీలంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, వికెట్ కీపర్ కుశాల్ పెరీరాకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టీమ్ మేనేజ్‌మెంట్ వైద్య పరీక్షలు చేయించింది. అయితే వీళ్లిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో శ్రీలంక టీమ్ ఆందోళన పడుతోంది. మిగతా ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు చేపట్టింది. అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా కరోనా బారిన పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా వాళ్లకు కరోనా సోకింది. గత ఏడాది ఫిబ్రవరిలో జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడుతున్న సమయంలో అవిష్క ఫెర్నాండోకు కరోనా సోకడంతో బూస్టర్ డోస్ తీసుకున్నాడు. మరోవైపు 2021లో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు కుశాల్ పెరీరాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కాగా ఈ ఏడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. పాకిస్తాన్ గడ్డపై నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంక గడ్డపై 9 మ్యాచ్‌లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించనుంది. ఈ టోర్నీలో ఈనెల 31న శ్రీలంక తన తొలి మ్యాచ్ ఆడనుంది. క్యాండీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌తో శ్రీలంక తలపడనుంది. ఈలోపు అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా కోవిడ్-19 నుంచి కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది. లేకపోతే వాళ్ల స్థానాలలో వేరే ఆటగాళ్లను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-08-25T17:33:35+05:30 IST