Viral Video: బౌలింగ్ వేస్తుంటే ఫీల్డ్ అంపైర్ చేసిన పని ఇదీ.. వైరల్ అవుతున్న వీడియో
ABN , First Publish Date - 2023-01-28T21:01:25+05:30 IST
దక్షిణాఫ్రికా(South Africa)-ఇంగ్లండ్(England) మధ్య జరిగిన తొలి వన్డేలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వాన్ డెర్ డుసెన్ సెంచరీ
బ్లోమ్‌ఫోంటెయిన్: దక్షిణాఫ్రికా(South Africa)-ఇంగ్లండ్(England) మధ్య జరిగిన తొలి వన్డేలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వాన్ డెర్ డుసెన్ సెంచరీ(111)తో చెలరేగడంతో సౌతాఫ్రికాతో తొలుత 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆ తర్వాత అన్రిచ్ నోకియా(Anrich Nortje ) సూపర్ స్పెల్‌తో అదరగొట్టి నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 271 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా సఫారీ జట్టు 27 పరగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జాసన్ రాయ్ (Jason Roy) బంతిని ఎదుర్కొనేందుకు క్రీజులో సిద్ధంగా ఉన్నాడు. బౌలర్ బంతిని సంధించాడు. రాయ్ ఆ బంతిని బలంగా బాదాడు. అయితే, ఆన్ ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్(Marais Erasmus) ఇదేమీ పట్టనట్టు అటుతిరిగి ఏమో చూసుకుంటున్నాడు. బంతిని బ్యాటర్ ఆడిన తర్వాత శబ్దానికి ఒక్కసారిగా ఇటు తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, సఫారీ జట్టు విజయంలో ఫాస్ట్ బౌలర్లు సిసంద మగల, అన్రిక్ నోకియా, కగిసో రబడ కీలక పాత్ర పోషించారు. నోకియా నాలుగు వికెట్లు తీసుకోగా, మగల 3, రబడ 2 వికెట్లు తీసుకున్నాడు. 299 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలుత విజయం దిశగా పయనిస్తున్నట్టుగానే కనిపించింది.
తొలి వికెట్‌కు రాయ్, డేవిడ్ మలాన్( Dawid Malan) 146 పరుగులు జోడించి జట్టులో జోష్ నింపారు. రాయ్ 91 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. అయితే, మలాన్ 59 పరుగులు చేశాడు. అయితే, ఆ తర్వాత క్రీజులో ఎవరూ నిలదొక్కుకోకపోవడం, దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఫలితంగా 271 పరుగులకు ఆలౌట్ అయి పరాజయాన్ని మూటగట్టుకుంది.