Share News

Upul Tharanga: శ్రీలంక సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్ నియామకం

ABN , Publish Date - Dec 13 , 2023 | 08:14 PM

Upul Tharanga: శ్రీలంక క్రికెట్ జట్టు నూతన సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగను నియమించినట్లు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో ప్రకటించారు. అంతేకాకుండా ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీని కూడా ఆయన వెల్లడించారు. ఐదుగురు సభ్యుల కమిటీలో అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా ఉన్నారు.

Upul Tharanga: శ్రీలంక సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్ నియామకం

గత నెలలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన చేసిన శ్రీలంక క్రికెట్‌ను ప్రక్షాళన చేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు కొత్త సెలక్షన్ కమిటీ నియామకానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ జట్టు నూతన సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగను నియమించినట్లు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో ప్రకటించారు. అంతేకాకుండా ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీని కూడా ఆయన వెల్లడించారు. ఐదుగురు సభ్యుల కమిటీలో అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా ఉన్నారు. రెండేళ్ల పాటు ఈ కమిటీ జట్టు ఎంపికలో బాధ్యతలు వహిస్తుందని హరీన్ ఫెర్నాండో తెలిపారు.

కాగా వన్డే ప్రపంచకప్‌లో పాయింట్ల పట్టికలో శ్రీలంక 9వ స్థానంలో నిలిచింది. ఆడిన 9 మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన శ్రీలంక 7 పరాజయాలను మూటగట్టుకుని మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో గతంలోని ప్రమోదయ విక్రమసింఘే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై శ్రీలంక ప్రభుత్వం వేటు వేసింది. ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవ ఆటతీరుకు సెలక్షన్ కమిటీనే కారణమని విమర్శలు చెలరేగాయి. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. జనవరి 6 నుంచి 18వ తేదీ మధ్య సొంతగడ్డపై జింబాబ్వేతో జరిగే వైట్ బాల్ క్రికెట్ కోసం కొత్త సెలక్షన్ కమిటీని శ్రీలంక ప్రభుత్వం నియమించింది. అయితే క్రికెట్ నిర్వహణలో రాజకీయ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ వేటు వేసింది. అంతేకాకుండా అండర్-19 ప్రపంచకప్ నిర్వహణను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు మార్చింది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 13 , 2023 | 08:14 PM