Share News

Team India: ఐదుగురు బౌలర్ల కూర్పు.. పాండ్యా స్థానంలో అతడి ఎంపిక సరైందేనా?

ABN , First Publish Date - 2023-11-04T21:30:43+05:30 IST

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడి టోర్నీ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో ఇప్పుడు టీమిండియా లైనప్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు బౌలర్లతోనే మనం మ్యాచ్‌లు గెలుస్తున్నా నాకౌట్ మ్యాచ్‌లలో ఆ ఐదుగురిలో ఎవరైనా గాయపడితే పరిస్థితేంటని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Team India: ఐదుగురు బౌలర్ల కూర్పు.. పాండ్యా స్థానంలో అతడి ఎంపిక సరైందేనా?

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. లీగ్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో ఆడాల్సిన మ్యాచ్‌లు నామమాత్రంగా మారాయి. అయితే ప్రస్తుతం టీమిండియా కూర్పు గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడి టోర్నీ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో ఇప్పుడు టీమిండియా లైనప్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు బౌలర్లతోనే మనం మ్యాచ్‌లు గెలుస్తున్నా నాకౌట్ మ్యాచ్‌లలో ఆ ఐదుగురిలో ఎవరైనా గాయపడితే పరిస్థితేంటని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

నిజానికి ఇప్పటివరకు బౌలింగ్ దళం బాగానే రాణించింది. బుమ్రా, షమీ, సిరాజ్ అంచనాలను మించి రాణిస్తున్నారు. స్పిన్ విభాగంలో జడేజా, కుల్‌దీప్ తమదైన ముద్ర వేస్తున్నారు. కానీ బ్యాటింగ్ ఆర్డర్‌లో సమష్టితత్వం లోపిస్తోంది. రోహిత్ ఆడితే కోహ్లీ ఆడటం లేదు. కోహ్లీ ఆడితే రోహిత్ ఆడటం లేదు. వీళ్లిద్దరూ ఆడని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే నాకౌట్‌లో బ్యాటింగ్ విభాగం రాణించి బౌలింగ్ తేలిపోతే.. అందరూ టీమిండియా కూర్పునే తప్పుబట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జట్టులో పార్ట్ టైమ్ బౌలర్లు లేరు. ఒక బౌలర్ విఫలమైతే ఆ కోటాను పూర్తి చేసే సత్తా కూడా మరో ఆటగాడికి లేదు. గతంలో జట్టులో బౌలింగ్ కష్టాలు వచ్చినప్పుడు సచిన్, గంగూలీ పార్ట్ టైమర్లుగా ఉండేవాళ్లు. ఆ తర్వాత ధోనీ హయాంలోనూ యువరాజ్ సింగ్, సురేష్ రైనా లాంటి బౌలర్లు జట్టులో ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పార్ట్ టైమ్ బౌలర్లు లేకపోవడంతో టీమిండియా బలహీనంగా కనిపిస్తోంది. దీంతో టైటిల్ సాధించే అవకాశాలు సన్నగిల్లుతాయి. నాకౌట్ మ్యాచ్‌లలో ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుని లాభం ఉండదు. బీసీసీఐ కూడా హార్దిక్ స్థానంలో ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేయడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రసిధ్ కృష్ణ స్థానంలో అక్షర్ పటేల్ లేదా మరో ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-11-04T21:30:45+05:30 IST