Asia Cup 2023: ఈ రెండు జట్లను లైట్ తీసుకుంటే.. టీమిండియా ఖేల్ ఖతమ్..!!

ABN , First Publish Date - 2023-08-26T15:01:10+05:30 IST

ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ కూడా అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక తలపడ్డాయి. మరి ఈసారైనా టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలుస్తుందా లేదా మరోసారి నిరాశ పరుస్తుందా?

Asia Cup 2023: ఈ రెండు జట్లను లైట్ తీసుకుంటే.. టీమిండియా ఖేల్ ఖతమ్..!!

టీమిండియా వరుసగా క్రికెట్ సిరీస్‌లను ఆడుతోంది. ఐపీఎల్ తర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ ఆడిన భారత్.. అనంతరం వెస్టిండీస్, ఐర్లాండ్ దేశాల్లో పర్యటించింది. ఇప్పుడు ఆసియా కప్‌కు సిద్ధం అవుతోంది. ఈనెల 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ కూడా అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక తలపడ్డాయి. అయితే 23 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈసారైనా భారత్ ఆసియా కప్ గెలుస్తుందా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.


నేపాల్ జట్టు చరిత్రలో తొలిసారి ఆసియా కప్ ఆడనుంది. దీంతో ఈ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. అయితే మిగిలిన ఐదు జట్లకు టైటిల్ నెగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆసియా కప్‌ను భారత్ లేదా పాకిస్థాన్ గెలుస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. సొంతగడ్డపై జరుగుతుండటంతో శ్రీలంక అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. అయితే బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లను టాప్-3 టీమ్స్ లైట్ తీసుకుంటే బొక్కబోర్లా పడటం ఖాయం. గత కొన్నేళ్లు ఈ రెండు జట్లు పెద్ద టీమ్‌లకు షాక్‌లు ఇచ్చిన సందర్భాలు అనేకం. ఇటీవల మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైన విషయాన్ని మరిచిపోకూడదు. అంతేకాకుండా ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో ఆప్ఘనిస్తాన్ దాదాపు గెలిచినంత పనిచేసింది. అందుకే ఈ రెండు జట్లను పసికూన జట్లుగా పరిగణించరాదని భారత్, పాకిస్థాన్, శ్రీలంక భావిస్తున్నాయి. గ్రూప్-బి నుంచి ఈ రెండు జట్లు సూపర్-4కు అర్హత సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: శ్రీలంక జట్టుకు షాక్.. ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్

మొత్తంగా చూసుకుంటే ఆసియా కప్‌లో అందరి దృష్టి సెప్టెంబర్ 2న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బౌలర్ బుమ్రా తిరిగిరావడం టీమిండియా బలాన్ని పెంచుతోందని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో బాగానే బౌలింగ్ చేసిన బుమ్రా వన్డే ఫార్మాట్‌లో ఎలా రాణిస్తాడో చూడాలని గంగూలీ పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో ప్రతి జట్టుకు గెలిచే అవకాశం ఉందని.. ఒక్క నేపాల్‌ను మినహాయిస్తే ఏ జట్టు ఏ మ్యాచ్‌లో గెలుస్తుందో చెప్పడం కష్టమేనని తెలిపాడు. భారత్, పాకిస్థాన్ రెండు జట్లు అద్భుతంగా ఉన్నాయని.. అయితే ఒత్తిడిని జయించిన జట్టు విజేతగా నిలుస్తుందని గంగూలీ స్పష్టం చేశాడు.

Updated Date - 2023-08-26T15:01:10+05:30 IST