World Cup: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రేసులో 9 మంది ఆటగాళ్లు.. టీమిండియా నుంచే నలుగురు
ABN , First Publish Date - 2023-11-18T16:03:26+05:30 IST
Player of the Tourney: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు సూపర్ ఫామ్‌లో ఉండడంతో ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
అహ్మదాబాద్: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు సూపర్ ఫామ్‌లో ఉండడంతో ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు పలు రకాల అవార్డుల ఇస్తారనే విషయం తెలిసిందే. అందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ముఖ్యమైనది. దీంతో ఈ ప్రపంచకప్‌లో ప్లేయర్ఆఫ్ ది టోర్నీ అవార్డు ఎవరికి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు రేసులో ఉన్న 9 మంది నామినీల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన జాబితాలో టీమిండియా నుంచి ఏకంగా నలుగురు ఆటగాళ్లు ఉండడం గమనార్హం. వారిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితోపాటు ఆస్ట్రేలియా నుంచి ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్‌వెల్.. న్యూజిలాండ్ నుంచి రచీన్ రవీంద్ర, డారిల్ మిచెల్, సౌతాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్ ఉన్నారు.
ఈ ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న విరాట్ కోహ్లీ 711 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కోహ్లీ రెండింటిలో మాత్రమే విఫలమయ్యాడు. మిగతా 8 మ్యాచ్‌ల్లో 50+ స్కోర్లు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో జట్టుకు అద్భుత ఆరంభాలు ఇస్తుండడంతోపాటు తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్న రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రేసులో ఉన్నాడు. బ్యాటర్‌గా ఇప్పటివరకు 550 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు ఏకంగా 124గా ఉండడం విశేషం. రోహిత్ కూడా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విఫలమయ్యాడు. మిగతా ఎనిమిదింటిలో చెలరేగాడు. అందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలున్నాయి. నాలుగు సార్లు వేగంగా 40+ పరుగులుచేసి ఔటయ్యాడు. టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా కూడా రేసులో ఉన్నారు. షమీ 13 వికెట్లు తీయగా.. బుమ్రా 18 వికెట్లు తీశాడు. 22 వికెట్లు తీసిన ఆడమ్ జంపా, 594 పరుగులు చేసిన క్వింటన్ డికాక్, 578 పరుగులు చేయడంతోపాటు 5 వికెట్లు తీసిన రచీన్ రవీంద్ర, 398 పరుగులు చేయడంతోపాటు 5 వికెట్లు తీసిన గ్లెన్ మాక్స్‌వెల్, 552 పరుగులు చేసిన డారిల్ మిచెల్ కూడా ప్లేయర్ టోర్నీ రేసులో ఉన్నారు. మొత్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఎవరికీ దక్కుతుందో తెలియాలంటే ఫైనల్ మ్యాచ్ ముగిసే వరకు ఎదురుచూడాల్సిందే.