Share News

Google Search: గూగుల్‌లో టాప్ లేపిన యువ ఆటగాళ్లు

ABN , First Publish Date - 2023-12-12T19:19:25+05:30 IST

Google Search: మరో 19 రోజుల్లో 2023 ఏడాది ముగియనుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన క్రికెటర్ల విశేషాలను గూగుల్ వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ల జాబితాలో యువ క్రికెటర్లు నిలవడం గమనించాల్సిన విషయం.

 Google Search: గూగుల్‌లో టాప్ లేపిన యువ ఆటగాళ్లు

మరో 19 రోజుల్లో 2023 ఏడాది ముగియనుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన క్రికెటర్ల విశేషాలను గూగుల్ వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ల జాబితాలో యువ క్రికెటర్లు నిలవడం గమనించాల్సిన విషయం. టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్, న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్ర గురించి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. వీళ్లిద్దరితో పాటు సీనియర్ క్రికెటర్లు మహ్మద్ షమీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్, ట్రావిస్ హెడ్ గురించి కూడా నెటిజన్‌లు ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ తెలిపింది. ఈ జాబితాలో టాప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు లేకపోవడంతో చాలా మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు క్రికెట్ టోర్నీలకు సంబంధించి టాప్-10 జాబితాను పరిశీలిస్తే.. ఐపీఎల్‌ను ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. వన్డే ప్రపంచకప్ కంటే ఐపీఎల్-2023 ట్యాగ్‌ను నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ జాబితాలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్ టోర్నీలు కూడా చోటు దక్కించుకున్నాయి. అటు మ్యాచ్‌ల విషయానికి వస్తే.. భారత్-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సెర్చింగ్ విషయంలో అగ్రస్థానంలో ఉంది. భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ రెండో స్థానంలో ఉండగా.. భారత్-శ్రీలంక లీగ్ మ్యాచ్ మూడో స్థానంలో ఉంది. భారత్-ఇంగ్లండ్ లీగ్ మ్యాచ్ నాలుగో స్థానంలో, భారత్-ఐర్లాండ్ మ్యాచ్ ఐదో స్థానంలో నిలిచాయి. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా టాప్-10లో నిలిచిందని గూగుల్ తెలిపింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ టాప్-9లో ఉంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-12T19:19:26+05:30 IST