Virat Kohli: నాలుగో స్థానానికి విరాట్ కోహ్లీనే బెస్ట్.. డివిల్లియర్స్ ఇంకా ఏమంటున్నాడంటే..?

ABN , First Publish Date - 2023-08-26T15:23:14+05:30 IST

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై డివిల్లియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు.

Virat Kohli: నాలుగో స్థానానికి విరాట్ కోహ్లీనే బెస్ట్.. డివిల్లియర్స్ ఇంకా ఏమంటున్నాడంటే..?

త్వరలో ఆసియా కప్ ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో టీమిండియాలో నంబర్ 4లో ఆడే బ్యాటర్ ఎవరనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై డివిల్లియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు. టీమిండియాలో నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్ ఎవరనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుందని, ఆ స్థానంలో కోహ్లీ ఆడతాడనే పుకార్లు తాను విన్నట్టు 360 డిగ్రీస్ బ్యాటర్ డివిల్లియర్స్ చెప్పాడు. ఇందుకు తాను మద్దతిస్తున్నట్టు కూడా పేర్కొన్నాడు.


‘‘విరాట్ కోహ్లీ నంబర్ 4 కు సరిగ్గా సరిపోతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఇన్నింగ్స్‌ను సరిదిద్దగలడు. మిడిలార్డర్‌లో ఎలాంటి పాత్రనైనా పోషించగలడు. అయితే అందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే కోహ్లీ నంబర్ 3లో ఆడడానికి ఇష్టపడతాడని మనకు తెలుసు. అతను ఆ స్థానంలో చాలా పరుగులు సాధించాడు. అయితే జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడాల్సిన బాధ్యత తప్పకుండా ఆటగాళ్లపై ఉంటుంది. అందుకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిందే. ఇక ఆసియాకప్‌లో టీమిండియా, పాకిస్థాన్ టైటిల్ ఫేవరేట్లు. అయితే శ్రీలంకకు పెద్ద జట్లకు షాక్ ఇవ్వగల సత్తా ఉంది. ఏ మాత్రం అలసత్వం వహించినా గతేడాది ఫలితం పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు.’’అని డివిల్లియర్స్ చెప్పుకొచ్చాడు.

కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెరీర్ ఆరంభంలో విరాట్ కోహ్లీ నంబర్ 4లోనే బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో నంబర్ 4లో విరాట్ కోహ్లీకి మంచి రికార్డులు కూడా ఉన్నాయి. ఆ స్థానంలో 55 సగటుతో 1,767 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలుండగా.. స్ట్రైక్ రేటు 90కి పైగా ఉంది. నాలుగో స్థానంలో బరిలోకి దిగే అవకాశాలున్న మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. ఆ స్థానంలో ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. 47 సగటుతో 805 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ, శ్రేయస్‌కు తోడు కేఎల్ రాహుల్ నుంచి కూడా నాలుగో స్థానానికి పోటీ ఉంది. దీంతో వీరి ముగ్గురిలో ఒకరు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-08-26T15:23:14+05:30 IST