Umesh Yadav: ఉమేశ్ యాదవ్‌ను రూ. 44 లక్షలు ముంచేసిన స్నేహితుడు!
ABN , First Publish Date - 2023-01-21T17:13:33+05:30 IST
టీమిండియా టాప్ బౌలర్ ఉమేశ్ యాదవ్(Umesh Yadav)ను స్నేహితుడే నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో టోపీ పెట్టాడు. ఈ ఘటనపై
నాగ్‌పూర్: టీమిండియా టాప్ బౌలర్ ఉమేశ్ యాదవ్(Umesh Yadav)ను స్నేహితుడే నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో టోపీ పెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్రే (37) అనే స్నేహితుడిని మేనేజర్‌గా నియమించుకున్నాడు. క్రికెట్‌తో ఉమేశ్ ఊపిరి సలపకుండా ఉండడంతో తన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చూసుకునేందుకు అతడిని నియమించుకున్నాడు.
అయితే, ఏడాది కాలంగా శైలేశ్(Shailesh Dutta Thakre) ఆ వ్యహారాలను పట్టించుకోవడం మానేశాడు. అంతేకాక, ఆస్తి కొనుగోలు పేరుతో రూ. 44 లక్షల మేర మోసగించాడు. కొరాడి పక్కనున్న ఎంఎస్‌ఈబీ కాలనీలో ఓ రియల్ ఎస్టేట్ ఆస్తి కొనుగోలు చేద్దామని చెప్పడంతో ఉమేశ్ అతడి ఖాతాకు రూ. 44 లక్షలు బదిలీ చేశాడు. ఆ డబ్బుతో అతడు ఉమేశ్ పేరున కాకుండా తన పేరుతో ఆస్తిని కొనుగోలు చేసి ఉమేశ్‌ను మోసం చేశాడు.
విషయం తెలిసిన యాదవ్ తన సొమ్మును తనకు తిరిగి ఇవ్వాలని కోరాడు. శైలేశ్ ఆ సొమ్మును తిరిగి ఇవ్వడానికి కానీ, ఆస్తిని ఉమేశ్ పేరున రాయడానికి కానీ అంగీకరించలేదు. దీంతో ఉమేశ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.