IND vs PAK: టీమిండియాను వదలని గాయాలు.. గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు మళ్లీ దూరం!

ABN , First Publish Date - 2023-09-10T16:01:47+05:30 IST

టీమిండియాను గాయాలు వదలడం లేదు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లంతా కోలుకుని ఇటీవలే జట్టులో చేరారు.

IND vs PAK: టీమిండియాను వదలని గాయాలు.. గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు మళ్లీ దూరం!

కొలంబో: టీమిండియాను గాయాలు వదలడం లేదు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లంతా కోలుకుని ఇటీవలే జట్టులో చేరారు. గాయం కారణంగా ఆసియా కప్ లీగ్ స్టేజ్ మ్యాచ్‌లకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా కోలుకుని జట్టులో చేరాడు. దీంతో ఆసియా కప్ సూపర్ 4లో పూర్తి జట్టును చూడొచ్చని అభిమానులు ఆశించారు. కానీ ఇంతలోనే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు వెన్ను నొప్పి ప్రారంభమైంది. దీంతో అతను పాక్‌తో పోరుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. దీంతో పూర్తి భారత జట్టును చూడాలని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కాగా వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ 6 నెలలపాటు టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2023, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 వంటి కీలక టోర్నీలకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వేసవిలో లండన్ వెళ్లి వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో కోలుకున్నాడు.


ఆసియా కప్‌లోనే జట్టులో చేరాడు. వన్డే ప్రపంచకప్‌నకు కూడా ఎంపికయ్యాడు. ఆసియా కప్ లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. దీంతో శ్రేయస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని అంతా భావించారు. కానీ ఇంతలోనే వెన్ను నొప్పి తిరగబెట్టింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు కొద్ది సమయం ముందు వెన్ను నొప్పి రావడంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్ సమయంలో రోహిత్ శర్మ చెప్పేవరకు ఎవరికీ తెలియదు. అయితే గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది తెలియాల్సి ఉంది. శ్రేయస్ ఈ ఒక్క మ్యాచ్‌కే దూరంగా ఉంటున్నాడా? లేదంటే మిగతా మ్యాచ్‌లకు కూడా దూరమవుతాడా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఏది ఏమైనా వెన్ను నొప్పి తిరగబెట్టడంతో శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై మరోసారి అనుమానాలు నెలకొన్నాయి. కాగా గాయాలతోనే చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ కూడా ఇటీవలనే జట్టులో చేరారు. రాహుల్ అయితే పాక్‌తో మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు.

ahmedabad-indias-shreyas-iyer-walks-back-to-pavilion-after-he-was-dismissed-by-.jpg

ఇక ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కాయిన్ వేయగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్స్ చెప్పాడు. కానీ కాయిన్ టేల్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. నిజానికి తాము టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగే చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌‌లో టీమిండియా రెండు కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడు. దీంతో మహ్మద్ షమీ మళ్లీ బెంచ్‌కు పరిమితమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఈ విషయాన్ని టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇది భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. దీంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులో వచ్చాడు. కాగా రెండు జట్ల మధ్య గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడే అవకాశాలున్నాయి. ఒక వేళ ఈ రోజు పూర్తి ఆట సాధ్యం కాకపోతే సోమవారం నాడు రిజర్వ్ డే కూడా ఉంది.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

Updated Date - 2023-09-10T16:01:47+05:30 IST