IND vs WI 1st T20: వెస్టిండీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-08-03T22:09:26+05:30 IST

కెప్టెన్ పావెల్(48), నికోలస్ పూరన్(41) రాణించడంతో మొదటి టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు చాహల్(2/24), అర్ష్‌దీప్ సింగ్(2/31), కుల్దీప్ యాదవ్(1/20), హార్దిక్ పాండ్యా(1/27) కట్టడి చేయడంతో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించలేకపోయింది.

IND vs WI 1st T20: వెస్టిండీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

ట్రినిడాడ్: కెప్టెన్ పావెల్(48), నికోలస్ పూరన్(41) రాణించడంతో మొదటి టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు చాహల్(2/24), అర్ష్‌దీప్ సింగ్(2/31), కుల్దీప్ యాదవ్(1/20), హార్దిక్ పాండ్యా(1/27) కట్టడి చేయడంతో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ బ్రెండన్ కాంగ్ ధాటిగా ప్రారంభించాడు. అయితే లెగ్ స్పిన్నర్ చాహల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఐదో ఓవర్లో చాహల్ మూడు బంతుల వ్యవధిలోనే ఓపెనర్లిద్దరినీ లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. బ్రెండన్ కింగ్ 28 పరుగులు చేయగా.. కైల్ మేయర్స్ ఒకే ఒక్క పరుగు చేశాడు. దీంతో 30 పరుగులకే విండీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్ పూరన్ మొదటి బంతి నుంచే ధాటిగా ఆడాడు. దీంతో మొదటి 6 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులతో 22 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు కట్టడి చేయడంతో వేగంగా ఆడలేకపోయాడు. అయితే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జాన్సన్ చార్లెస్(3) ఇచ్చిన క్యాచ్‌ను తెలుగు కుర్రాడు, అరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ అద్భుతంగా అందుకున్నాడు. ముందుకు పరిగెడుతూ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.


ఈ క్రమంలో కెప్టెన్ రోమన్ పావెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పూరన్ ముందుకు నడిపించాడు. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన 14వ ఓవర్‌లో, హార్దిక్ పాండ్యా వేసిన 15వ ఓవర్‌లో పావెల్ ఇచ్చిన క్యాచ్‌లను గిల్, చాహల్ నేలపాలు చేశారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న పావెల్ ఆ తర్వాత 2 భారీ సిక్సులు బాదాడు. 15వ ఓవర్‌లో నికోలస్ పూరన్(34 బంతుల్లో 41)ను కెప్టెన్ హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన పూరన్.. తిలక్ వర్మకు దొరికిపోయాడు. దీంతో 96 పరుగుల వద్ద విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో హెట్‌మేమయర్‌తో కలిసి విండీస్ స్కోర్‌ను కెప్టెన్ పావెల్ 100 పరుగులు దాటించాడు. దీంతో ఓవర్లు ముగిసే సమయానికి విండీస్ 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ పరుగులు కట్టడి చేశారు. స్కోర్ బోర్డులో వేగం పెంచే ప్రయత్నం చేస్తున్న పావెల్(32 బంతుల్లో 48), హెట్‌మేయర్‌(10)ను 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. ముఖేష్ కుమార్ వేసిన చివరి ఓవర్‌లో 9 పరుగులొచ్చాయి. కాగా చివరి 3 ఓవర్లలో విండీస్ బ్యాటర్లు ఒక బౌండరీ కూడా బాదలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, చాహల్ రెండేసి వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-08-03T22:09:26+05:30 IST