IND vs WI 3rd T20: చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. పావెల్ మెరుపులు.. టీమిండియా ముందు టఫ్ టార్గెట్!
ABN , First Publish Date - 2023-08-08T22:01:30+05:30 IST
మూడో టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ 160 పరుగుల టఫ్ లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ గత రెండు టీ20ల మాదిరిగానే స్లోగా ఉండడంతో చేధన అంత సులభం కాకపోవచ్చు.
గయానా: మూడో టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ 160 పరుగుల టఫ్ లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ గత రెండు టీ20ల మాదిరిగానే స్లోగా ఉండడంతో చేధన అంత సులభం కాకపోవచ్చు. విండీస్ టాపార్డర్‌ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(3/28), అక్షర్ పటేల్(1/24) కట్టడి చేయడంతో విండీస్‌కు పరుగులు అంత సులువుగా లభించలేదు. అయితే చివరలో విండీస్ కెప్టెన్ పావెల్ మెరుపులు మెరిపించడంతో కరేబియన్ల స్కోర్ 150 దాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే భారత బౌలర్లు కట్టడి చేయడంతో పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి విండీస్ 38 పరుగులే చేసింది. అయితే ఈ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని 8వ ఓవర్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ విడదీశాడు. అక్షర్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్(25) ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్ అందుకున్నాడు. దీంతో 55 పరుగుల వద్ద వెస్టిండీస్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎంట్రీతో విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 11వ ఓవర్‌లో జాన్సన్ చార్లెస్(25)ను పెవిలియన్ చేర్చిన కుల్దీప్ యాదవ్.. 15వ ఓవర్‌లో కీలకమైన నికోలస్ పూరన్(20), బ్రాండన్ కింగ్(42)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ టాప్ 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది.
అయితే వరుసగా 3 వికెట్లు తీసిన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన టీ20 కెరీర్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. కాగా కుల్దీప్ 30 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. అలాగే 20 పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ కూడా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో శామ్యూల్స్(1611)ను పూరన్(1613) అధిగమించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే షిమ్రోన్ హేట్‌మేయర్(9)ను 18వ ఓవర్ మొదటి బంతికి పేసర్ ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 123 పరుగులకు వెస్టిండీస్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ జట్టుకు పరుగులు కూడా వేగంగా లభించలేదు. కానీ కెప్టెన్ రోవ్మాన్ పావెల్ డెత్ ఓవర్లలో చెలరేగాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో 2 సిక్సులతో 17 పరుగులు రాబట్టాడు. ముఖేష్ కుమార్ వేసిన చివరి ఓవర్‌లోనూ ఓ సిక్సు బాదడంతో 11 పరుగులొచ్చాయి. దీంతో విండీస్ స్కోర్ 150 దాటింది. చివరి 2 ఓవర్లలోనే ఆ జట్టుకు 28 పరుగులొచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 3 సిక్సులు, ఒక ఫోర్‌తో 19 బంతుల్లోనే 40 పరుగులు చేసిన పావెల్ నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.