IND vs WI: తెలుగోడికి ఆ ప్లేయర్ నుంచి గట్టి పోటీ.. తొలి టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ABN , First Publish Date - 2023-08-02T18:10:46+05:30 IST

మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. కాకపోతే మరో యువ ఆటగాడి నుంచి తిలక్ వర్మకు గట్టి పోటీ తప్పే అవకాశాలు కనిపించడంలేదు.

IND vs WI: తెలుగోడికి ఆ ప్లేయర్ నుంచి గట్టి పోటీ.. తొలి టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ట్రినిడాడ్: భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు, వన్డే సమరం ముగిసింది. ఈ రెండు సిరీస్‌ల్లోనూ టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇక ఈ నెల 3 నుంచి రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం 15 మందితో కూడిన యువ జట్టు ఇప్పటికే కరేబియన్ గడ్డపై అడుగుపెట్టి సాధన కూడా మొదలుపెట్టింది. టీ20 జట్టును హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ సిరీస్‌లో భాగంగా గురువారం రెండు జట్ల మధ్య బ్రియన్ లారా క్రికెట్ మైదానంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. కాకపోతే మరో యువ ఆటగాడి నుంచి తిలక్ వర్మకు గట్టి పోటీ తప్పే అవకాశాలు కనిపించడంలేదు.


ముఖ్యంగా ఓపెనింగ్ విషయంలో కాస్త సందిగ్ధత నెలకొంది. శుభ్‌మన్ గిల్ ఒక ఓపెనర్‌గా ఖాయం కాగా.. మరో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌లో ఎవరికీ అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే అనుభవం ద‌ృష్యా కిషన్‌నే ఓపెనర్‌గా పంపే అవకాశాలున్నాయి. మూడో స్థానంలో సంజూ శాంసన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ ఆడొచ్చు. లేదంటే వన్‌డౌన్‌లోనే సూర్య బ్యాటింగ్‌కు వచ్చి, నాలుగో స్థానంలో సంజూ బ్యాటింగ్‌కు రావొచ్చు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌ల రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు జట్టులో ఉన్నప్పటికీ కీపింగ్ బాధ్యతలను ఇషాన్ కిషన్‌కు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కిషన్‌ను రానున్న వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధం చేస్తున్నారు.

ఇక ఐదో స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్‌ ఒక్కరినే ఆడించే అవకాశాలున్నాయి. పైగా ఇద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కావడం గమనార్హం. అయితే ఇప్పటికే టెస్టుల్లో జైస్వాల్ రాణించడంతో తిలక్ వర్మకు గట్టి పోటీ తప్పకపోవచ్చు. కానీ మిడిలార్డర్‌లో రాణించిన అనుభవం జైస్వాల్‌కు లేదు. అతను ఎక్కువగా ఓపెనర్‌గానే ఆడాడు. అదే తిలక్ వర్మ విషయానికొస్తే ఐపీఎల్ అంతా మిడిలార్డర్‌లో ఆడాడు. కాబట్టి తిలక్ వర్మను ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ జైస్వాల్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ పంపించి.. సూర్య, శాంసన్‌ను నాలుగు, ఐదో స్థానాల్లో ఆడిస్తే తిలక్‌కు చోటు కష్టమే అని చెప్పుకోవాలి. అలా కాకుండా ఇద్దరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు ప్రధాన బౌలర్లలో ఒకరిని తగ్గించొచ్చు. ఏది ఏమైనా జైస్వాల్, తిలక్‌లలో ఎవరూ ఆడిన టీ20ల్లోకి అరంగేట్రం చేసినట్టవుతుంది.

ఇక ఆరో స్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఏడో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఖాయం కాగా.. ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని భావిస్తే చాహల్‌కు కూడా అవకాశం రావొచ్చు. ఇక పేస్ కోటాలో అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ కచ్చితంగా ఆడే అవకాశాలున్నాయి. మూడ్ పేసర్‌గా ఆవేష్ ఖాన్ ఆడే అవకాశాలున్నాయి. అయితే అతనికి ఉమ్రాన్ మాలిక్ నుంచి గట్టి తప్పకపోవచ్చు. కానీ వన్డే సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

టీమిండియా తుది జట్టు(అంచనా)

ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ/యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్

Updated Date - 2023-08-02T18:10:46+05:30 IST