IND vs WI T20 Series: ఏడుగురు భారత ఆటగాళ్లను ఊరిస్తున్న 7 రికార్డులు.. అవేంటంటే..?

ABN , First Publish Date - 2023-08-02T21:50:40+05:30 IST

భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. మొత్తం ఏడుగురు భారత ఆటగాల్లు ఏడు రికార్డులకు చేరువలో ఉన్నారు.

IND vs WI T20 Series: ఏడుగురు భారత ఆటగాళ్లను ఊరిస్తున్న 7 రికార్డులు.. అవేంటంటే..?

గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే వన్డే, టెస్టు సిరీస్ గెలిచి జోరు మీదున్న భారత జట్టు టీ20 సిరీస్ కూడా గెలవాలని భావిస్తోంది. ఇక సొంత గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌ కోల్పోయిన వెస్టిండీస్ టీ20 సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. పలువురు ఆటగాళ్లు జట్టులో తిరిగి రావడంతో విండీస్ బలం కాస్త పెరిగినట్టుగా కనిపిస్తుంది. పైగా టీ20ల్లో వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదు. తమదైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించగలరు. అంతేకాకుండా వెస్టిండీస్ రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిందనే సంగతి మరిచిపోకూడదు. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. మొత్తం ఏడుగురు భారత ఆటగాల్లు ఏడు రికార్డులకు చేరువలో ఉన్నారు.


2- టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో 2 వికెట్లు తీస్తే అన్నిరకాల టీ20ల్లో 150 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటికే టీ20ల్లో హార్దిక్ పాండ్యా 4 వేల పరుగులు చేశాడు. దీంతో 4 వేల పరుగులు చేసి 150 వికెట్లు తీసిన మొదటి భారత ఆటగాడిగా పాండ్యా రికార్డు నెలకొల్పుతాడు.

325- టీమిండియా మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరొక 325 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా సూర్య నిలుస్తాడు.

21- స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ మరొక 21 పరుగులు చేస్తే అన్ని రకాల టీ20ల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన 12వ భారత ఆటగాడిగా శాంసన్ రికార్డుల్లోకి ఎక్కుతాడు.

9- టీమిండియా లెగ్ స్పిన్నర్ యజుర్వేంద్ర చాహల్ మరొక 9 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.

4- చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరొక 4 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. తద్వారా వేగంగా ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.

80- ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మరొక 80 పరుగులు చేస్తే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 2500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. తద్వారా టీ20ల్లో 2500+ పరుగులు, 150+ వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు.

9- యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరొక 9 వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించి ఐదో భారత పేసర్‌గా నిలుస్తాడు.

Updated Date - 2023-08-02T21:50:40+05:30 IST