Ind vs Wi: కెప్టెన్ రోహిత్ శర్మపై రహానే ప్రశంసలు.. ఏమన్నాడంటే..?

ABN , First Publish Date - 2023-07-11T16:10:40+05:30 IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై వైస్ కెప్టెన్ అజింక్య రహానే ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ మంచి నాయకత్వ లక్షణాలు కల్గి ఉన్నాడని, ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తాడని కొనియాడాడు. బుధవారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రహానే పలు వ్యాఖ్యలు చేశాడు.

Ind vs Wi: కెప్టెన్ రోహిత్ శర్మపై రహానే ప్రశంసలు.. ఏమన్నాడంటే..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై వైస్ కెప్టెన్ అజింక్య రహానే ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మకు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తాడని కొనియాడాడు. బుధవారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రహానే పలు వ్యాఖ్యలు చేశాడు. 35 ఏళ్ల రహానే ఇంతకుముందు కూడా టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఫేలవఫామ్‌తో 2021 సౌతాఫ్రికా పర్యటన తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. తాజాగా విండీస్ పర్యటన ద్వారా మళ్లీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో రహానే మాట్లాడుతూ "నేను ఈ పాత్రకు అలవాటు పడ్డాను. దాదాపు నాలుగైదేళ్లు వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. తిరిగి జట్టులోకి వచ్చినందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. వైస్ కెప్టెన్‌గా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో నేను ఆడిన మొదటి గేమ్ డబ్ల్యూటీసీ ఫైనల్. కెప్టెన్‌గా రోహిత్ ఆటగాళ్లందరికీ స్వేచ్ఛనిస్తాడు. రోహిత్ శర్మకు గొప్ప కెప్టెన్‌కు ఉండాల్సిన మంచి లక్షణాలు ఉన్నాయి" అని చెప్పుకొచ్చాడు.


అలాగే మొదటిసారి టీమిండియాకు ఎంపికైన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై కూడా రహానే ప్రశంసలు కురిపించాడు. జైస్వాల్ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, అతను అద్భుతమైన ప్రతిభను కల్గి ఉన్నాడని కొనియాడాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై తరఫున, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడాడని గుర్తు చేశాడు. ‘‘గత సంవత్సరం దులీప్ ట్రోఫీలో జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఎర్ర బంతితో జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్న విధానం బాగుంది.’’ అని రహానే తెలిపాడు. కాగా భారత్, వెస్టిండీస్ మధ్య బుధవారం నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ డొమినికా వేదికగా జరగనుంది.

Updated Date - 2023-07-11T17:15:35+05:30 IST