T20 India Lost : బ్యాటర్ల బోల్తా

ABN , First Publish Date - 2023-08-04T03:02:41+05:30 IST

స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్‌ లైనప్‌(Indian batting line-up) ముందు 150 పరుగుల ఛేదన పెద్ద కష్టమా.. అనిపించినా, విండీస్‌ పేసర్లు(West Indies Pacers) బెంబేలెత్తించారు. అరంగేట్ర బ్యాటర్‌ తిలక్‌ వర్మ(Tilak Verma) (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) రాణించగా.. మిగతా బ్యాటర్ల వైఫల్యం దెబ్బతీసింది.

T20 India Lost : బ్యాటర్ల బోల్తా

తొలి టీ20లో భారత్‌ ఓటమి

రాణించిన తిలక్‌ వర్మ

విండీస్‌ శుభారంభం

ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన రెండో భారత క్రికెటర్‌గా ముకేశ్‌. గతంలో నటరాజన్‌ (ఆసీస్‌ పర్యటనలో) ఈ ఫీట్‌ సాధించాడు.

పాకిస్థాన్‌ తర్వాత 200వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడిన జట్టుగా భారత్‌.

టరౌబా: స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్‌ లైనప్‌(Indian batting line-up) ముందు 150 పరుగుల ఛేదన పెద్ద కష్టమా.. అనిపించినా, విండీస్‌ పేసర్లు(West Indies Pacers) బెంబేలెత్తించారు. అరంగేట్ర బ్యాటర్‌ తిలక్‌ వర్మ(Tilak Verma) (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) రాణించగా.. మిగతా బ్యాటర్ల వైఫల్యం దెబ్బతీసింది. దీంతో ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. గురువారం జరిగిన తొలి టీ20లో విండీస్‌(Windies) 4 పరుగుల తేడాతో నెగ్గి, ఐదు టీ20ల సిరీస్‌(Five T20 series)లో 1-0తో ఆధిక్యం అందుకుంది. రెండో మ్యాచ్‌ ఆదివారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. పావెల్‌ (32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48), పూరన్‌ (34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) రాణించారు. అర్ష్‌దీప్‌, చాహల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. హోల్డర్‌, మెక్‌కాయ్‌, షెఫర్డ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హోల్డర్‌ నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్‌తో భారత్‌ తరఫున టీ20ల్లో తెలుగు క్రికెటర్‌ తిలక్‌ వర్మ, పేసర్‌ ముకేశ్‌ అరంగేట్రం చేశారు.


తిలక్‌ ఒక్కడే..

స్లో పిచ్‌పై స్వల్ప ఛేదన కోసం భారత్‌ తంటాలు పడింది. ఓపెనర్లు గిల్‌ (3), ఇషాన్‌ (6) విఫలం కాగా.. తిలక్‌ వర్మ వరుసగా రెండు సిక్సర్లతో తన అంతర్జాతీయ క్రికెట్‌కు స్వాగతం పలికాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా పుల్‌ షాట్లతో చెలరేగి ఎనిమిదో ఓవర్‌లో 6,4తో 13 రన్స్‌ రాబట్టాడు. అటు సూర్యకుమార్‌ (21) కూడా బంతికో పరుగు చొప్పున ఆడాడు. ఇద్దరూ ప్రమాదకరంగా కనిపించిన దశలో వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరడంతో జట్టు 77/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిలో 16వ ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన హోల్డర్‌.. కెప్టెన్‌ హార్దిక్‌ (19)ను బౌల్డ్‌ చేయగా, శాంసన్‌ (12) రనౌట్‌ కావడంతో ఉత్కంఠ పెరిగింది. సిక్సర్‌తో అక్షర్‌ (13) ఆశలు రేపినా 19వ ఓవర్‌లో వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో అర్ష్‌దీప్‌ (12) వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో సమీకరణం ఆరు బంతుల్లో 10 రన్స్‌కు చేరింది. కానీ చివరి ఓవర్‌లో కుల్దీప్‌ (3), అర్ష్‌దీప్‌ వికెట్లను కోల్పోయిన భారత్‌ 5 పరుగులే చేసి ఓటమి పాలైంది.

ఆరంభం బాగున్నా...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఆటతీరు ఆరంభానికి, ముగింపునకు సంబంధం లేకుండా సాగింది. పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. కింగ్‌, పూరన్‌ల ధాటికి 54 పరుగులతో జోరు మీద కనిపించింది. కానీ మధ్య ఓవర్లలో స్పిన్‌ ధాటికి గతి తప్పింది. ఓపెనర్‌ కింగ్‌ (28) ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. కానీ ఈ టూర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న స్పిన్నర్‌ చాహల్‌ తన మొదటి మూడు బంతుల్లోనే మేయర్స్‌ (1), కింగ్‌ వికెట్లతో విండీస్‌ జోరుకు బ్రేక్‌ వేశాడు. అయితే భీకర ఫామ్‌లో ఉన్న పూరన్‌ అదే ఓవర్‌లో 4,6తో తన ఉద్దేశాన్ని చాటాడు. తర్వాత అక్షర్‌ ఓవర్‌లోనూ 6,4తో అదరగొట్టాడు. ఈ దశలో ఎనిమిదో ఓవర్‌లో కుల్దీప్‌.. చార్లెస్‌ (3) వికెట్‌ తీశాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుతూ తిలక్‌ వర్మ ఈ క్యాచ్‌ను అద్భుతంగా పట్టేశాడు. చివరకు ఒత్తిడిలో పడిన పూరన్‌ను 15వ ఓవర్‌లో హార్దిక్‌ అవుట్‌ చేశాడు. ముకేశ్‌ తన చివరి రెండు ఓవర్లలో సూపర్‌ యార్కర్లతో నిలువరించగా.. 19వ ఓవర్‌లో హెట్‌మయెర్‌ (10), పావెల్‌ల వికెట్లతో అర్ష్‌దీప్‌ మరింతగా దెబ్బతీశాడు.

స్కోరుబోర్డు

వెస్టిండీస్‌:

కింగ్‌ (ఎల్బీ) చాహల్‌ 28, మేయర్స్‌ (ఎల్బీ) చాహల్‌ 1, చార్లెస్‌ (సి) తిలక్‌ వర్మ (బి) కుల్దీప్‌ 3, పూరన్‌ (సి) తిలక్‌ వర్మ (బి) హార్దిక్‌ 41, పావెల్‌ (సి) కుల్దీప్‌ (బి) అర్ష్‌దీప్‌ 48, హెట్‌మయెర్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 10, షెఫర్డ్‌ (నాటౌట్‌) 4, హోల్డర్‌ (నాటౌట్‌) 6, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం : 20 ఓవర్లలో 149/6; వికెట్లపతనం: 1/29, 2/30, 3/58, 4/96, 5/134, 6/138; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-31-2, ముకేశ్‌ 3-0-24-0, అక్షర్‌ 2-0-22-0, చాహల్‌ 3-0-24-2, హార్దిక్‌ 4-0-27-1, కుల్దీప్‌ 4-0-20-1

భారత్‌:

కిషన్‌ (సి) పావెల్‌ (బి) మెకాయ్‌ 6, గిల్‌ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) హొసేన్‌ 3, సూర్యకుమార్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) హోల్డర్‌ 21, తిలక్‌ వర్మ (సి) హెట్‌మయెర్‌ (బి) షెఫర్డ్‌ 39, హార్దిక్‌ (బి) హోల్డర్‌ 19, శాంసన్‌ (రనౌట్‌) 12, అక్షర్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) మెకాయ్‌ 13, కుల్దీప్‌ (బి) షెఫర్డ్‌ 3, అర్ష్‌దీప్‌ (రనౌట్‌) 12, చాహల్‌ (నాటౌట్‌) 1, ముకేశ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం : 20 ఓవర్లలో 145/9; వికెట్లపతనం : 1/5, 2/28, 3/67, 4/77, 5/113, 6/113, 7/129, 8/140, 9/144; బౌలింగ్‌ : హొసేన్‌ 4-0-17-1, మెకాయ్‌ 4-0-28-2, అల్జారి జోసెఫ్‌ 4-0-39-0, జాసన్‌ హోల్డర్‌ 4-1-19-2, షెఫర్డ్‌ 4-0-33-2.

Updated Date - 2023-08-04T04:38:57+05:30 IST