Share News

IND vs SA: మొదటి టీ20కి వర్షం ముప్పు.. మ్యాచ్ జరుగుతుందా? లేదా?..

ABN , First Publish Date - 2023-12-10T11:06:14+05:30 IST

IND vs SA 1st T20I: టీమిండియా, సౌతాఫ్రికా క్రికెట్ పోరుకు సమయం ఆసన్నమైంది. నెల రోజులపాటు సాగనున్న సౌతాఫ్రికా పర్యటనలో అతిథ్య జట్టుతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌లను ఆడనుంది.

IND vs SA: మొదటి టీ20కి వర్షం ముప్పు.. మ్యాచ్ జరుగుతుందా? లేదా?..

డర్బన్: టీమిండియా, సౌతాఫ్రికా క్రికెట్ పోరుకు సమయం ఆసన్నమైంది. నెల రోజులపాటు సాగనున్న సౌతాఫ్రికా పర్యటనలో అతిథ్య జట్టుతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌లను ఆడనుంది. డర్బన్ వేదికగా నేడు జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో భారత్, సౌతాఫ్రికా పోరుకు తెరవలేనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇటీవల భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో రెండు జట్లు సత్తా చాటాయి. అన్ని విభాగాల్లో రెండు జట్లు అదరగొట్టాయి. రెండు జట్లు బలంగా ఉండడంతో టీ20 సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.


కానీ మొదటి టీ20 మ్యాచ్‌ను వరుణుడు కలవరపెడుతున్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం వచ్చే అవకాశాలున్నాయి. స్థానిక వాతావరణ నివేదికగా ప్రకారం ఆదివారం డర్బన్‌లో వర్షం పడనుంది. మ్యాచ్ జరిగే సమయంలో కూడా 75 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. ఆకాశం మేఘావృతం ఉండగా.. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. తేమ స్థాయి 86 శాతంగా ఉండొచ్చు. దీంతో పూర్తి మ్యాచ్ జరగడం కష్టంగానే కనిపిస్తోంది. మ్యాచ్ జరగానికి వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావొచ్చు.

పిచ్ రిపోర్టు విషయానికొస్తే మ్యాచ్ జరిగే డర్బన్‌లో టీమిండియాకు మంచి రికార్డులున్నాయి. ఇక్కడ టీమిండియా ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆడిన ఐదింటిలోనూ గెలిచింది. ఈ ఏడాది డర్బన్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 190+ స్కోర్లు వచ్చాయి. ఓవరాల్‌గా మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 143గా ఉంది. సౌతాఫ్రికా అంటేనే పేస్ పిచ్‌లు కాబట్టి డర్బన్‌లో కూడా అవే పరిస్థితులు ఉండనున్నాయి. ఆదివారం వర్షం పడే అవకాశాలు కూడా ఉండడంతో పేసర్లకు మరింత సహకారం లభించనుంది. బంతి బౌన్స్ అవడంతోపాటు స్వింగ్ లభించనుంది. అయితే బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టడం పెదగా కష్టమేమి కాదు. డర్బన్‌లో ఇప్పటివరకు 19 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు కూడా 8 సార్లు గెలిచాయి. ఒక మ్యాచ్ టై కాగా.. రెండు రద్దయ్యాయి. దీంతో ఇక్కడ టాస్ ప్రభావం పెదగా ఉండకపోవచ్చు. ఇప్పటివరకు టీ20లో భారత్, సౌతాఫ్రికా జట్లు 24 మ్యాచ్‌లు ఆడాయి. అత్యధికంగా భారత్ 13, సౌతాఫ్రికా 10 గెలిచాయి. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. గతంలో రెండు జట్లు నాలుగు టీ20 సిరీస్‌ల్లో తలపడ్డాయి. రెండు సిరీస్‌లను టీమిండియా గెలుచుకోగా.. మరొ రెండు డ్రాగా ముగిశాయి.

Updated Date - 2023-12-10T11:44:54+05:30 IST