India vs Sri Lanka 2nd ODI: మెరిసిన కేఎల్ రాహుల్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఘనవిజయం..

ABN , First Publish Date - 2023-01-12T21:10:12+05:30 IST

భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) వన్డే సిరీస్‌లో (ODI Series) భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

India vs Sri Lanka 2nd ODI: మెరిసిన కేఎల్ రాహుల్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఘనవిజయం..

కోల్‌కతా: భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) వన్డే సిరీస్‌లో (ODI Series) భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి శ్రీలంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. 64 పరుగులతో చివరివరకు క్రీజులో నిలిచిన కేఎల్ రాహుల్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సునాయాస లక్ష్యంతోనే భారత్ బ్యాటింగ్‌కు దిగినప్పటికీ 86 పరుగులకే కీలకమైన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడ్డట్టు అనిపించింది. అయితే హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ జోడీ 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం భారత్ గెలుపులో టర్నింగ్ పాయింట్ అయింది. కీలక దశలో పాండ్యా ఔటయినా అక్షర్ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌లతో జతకట్టి రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు.

భారత బ్యాటింగ్: రోహిత్ శర్మ (17), శుభ్‌మన్ గిల్ (21), విరాట్ కోహ్లీ(4), శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (64 నాటౌట్), హార్ధిక్ పాండ్యా (36), అక్షర్ పటేల్ (21), కుల్దీప్ యాదవ్ (10 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ భారత్‌ను ఓడించలేకపోయారు. లహిరు కుమార, చమిక కరుణరత్నే చెరో 2 వికెట్లు తీయగా.. కసున్ రజిత, ధనంజయ్ డిసిల్వా చెరో వికెట్ తీశారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ దక్కించుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డే తిరువనంతపురం వేదికగా జనవరి 15, 2023న జరగనుంది.

చెలరేగిన భారత బౌలర్లు..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి లంక బ్యాట్స్‌మెన్లకు దడపుట్టించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు తీసి 215 పరుగులకే ఆలౌట్ చేశారు. 39.4 ఓవర్లలోనే లంక బ్యాట్స్‌మెన్ చేతులు ఎత్తేశారు. భారత్ బౌలర్లలో అత్యధికంగా కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీసి శ్రీలంక నడ్డివిరిచారు. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ చొప్పున తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది. నువనిడు ఫెర్నాండోను శుభ్‌మన్ గిల్/రాహుల్ రనౌట్‌గా వెనక్కుపంపారు.

శ్రీలంక బ్యాటింగ్: అవిష్క ఫెర్నాండో (20), నువినిండు ఫెర్నాండో (50, రనౌట్), కుశాల్ మెండిస్ (34), ధనంజయ్ డిసిల్వా (0), చరిత అసలంక (15), దసున్ షణక (2), వణిందు హసరంగ (21), దునిత్ వెల్లలాగె (23), చమిక కరుణరత్నే (17), కసున్ రజిత (17 నాటౌట్), లహిరు కుమార (0). కాగా లంక బ్యాట్స్‌మెన్లలో అత్యధిక స్కోరు చేసిన నువినిండు ఫెర్నాండో(50) రనౌట్ రూపంలో ఔటవ్వడం గమనార్హం.

Updated Date - 2023-01-12T21:24:03+05:30 IST