Share News

Gambhir vs Sreesanth: మైదానంలో టీమిండియా దిగ్గజాల మధ్య మాటల యుద్ధం.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-12-07T13:29:05+05:30 IST

Legends League: గౌతం గంభీర్, శ్రీశాంత్. క్రికెట్ చూసే వారికి ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు తమ ఆటతో ఎంతటి ప్రాముఖ్యతను సంపాదించారో వివాదాలతోనూ అదే స్థాయిలో పాపులర్ అయ్యారు.

Gambhir vs Sreesanth: మైదానంలో టీమిండియా దిగ్గజాల మధ్య మాటల యుద్ధం.. అసలు ఏం జరిగిందంటే..?

గౌతం గంభీర్, శ్రీశాంత్. క్రికెట్ చూసే వారికి ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు తమ ఆటతో ఎంతటి ప్రాముఖ్యతను సంపాదించారో వివాదాలతోనూ అదే స్థాయిలో పాపులర్ అయ్యారు. ఎదుటి ఆటగాళ్లు ఎంత తోపులైనా గొడవల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. టీమిండియా రెండు ప్రపంచకప్ ఫైనల్స్ గెలవడంలో గంభీర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో గంభీర్ పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. మైదానంలో అగ్రెసివ్‌గా కనిపించే గంభీర్ తోటి ఆటగాళ్లతో గొడవలు పెట్టుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడు. పాకిస్థాన్ ఆటగాళ్లు, విరాట్ కోహ్లీతో గంభీర్‌కు అయిన గొడవలే వీటికి సాక్ష్యాలు. ఇక టీమిండియాలో స్టార్ బౌలర్‌గా ఎదుగుతున్న రోజుల్లో ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన శ్రీశాంత్ అద్భుతమై క్రికెట్ కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. సాధారణంగానే అగ్రెసివ్ ఆటగాడైనా శ్రీశాంత్‌కు కూడా మైదానంలో పలు వివాదాలున్నాయి. అలాంటి గంభీర్, శ్రీశాంత్ మైదానంలో గొడవపడితే ఇంకేమైనా ఉందా? రచ్చ రచ్చ ఖావడం ఖాయం. తాజాగా ఇదే జరిగింది.


క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లంతా కలిసి ఆడే లెజెండ్స్ లీగ్ 2023లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో బుధవారం గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇండియా క్యాపిటల్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. శ్రీశాంత్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్ గంభీర్ వరుసగా సిక్సు, ఫోర్ బాదాడు. ఆ తర్వాతి బంతి డాట్ కావడంతో గంభీర్‌ను శ్రీశాంత్ కవ్వించాడు. సీరియస్ లుక్‌తో గంభీర్ వైపు కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. అసలే అగ్రెసివ్‌గా ఉండే గంభీర్ దానికి ఊరుకుంటాడా? శ్రీశాంత్‌కు నోటితో సమాధానం చెప్పాడు. దానికి శ్రీశాంత్ అసలు ఉరుకోలేదు. అతను కూడా ఏదో అన్నాడు. అలా మాట మాట పెరిగి ఇద్దరు మైదానంలోనే ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. పరిస్థితి చూస్తుంటే ఇద్దరు మైదానంలోనే కొట్టుకుంటారేమో అనిపించింది. కానీ వెంటనే రంగంలోకి దిగిన సహచర ఆటగాళ్లు, అంపైర్లు ఇద్దరికి సర్దిచెప్పి గొడవను ఆపారు. దీంతో గొడవ సద్దుమణిగింది. వీరిద్దరి మధ్య మరోసారి ఎలాంటి గొడవ జరగకపోవడంతో మ్యాచ్ సజావుగా సాగింది. అయితే గంభీర్- శ్రీశాంత్ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన గంభీర్ 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రీశాంత్ ఓ వికెట్ తీసినప్పటికీ 35 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ జట్టు 210 పరుగులు చేసింది. 9 ఫోర్లు, 4 సిక్సులతో 55 బంతుల్లోనే 84 పరుగులతో క్రిస్ గేల్ చెలరేగినప్పటికీ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఇండియా క్యాపిటల్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-07T13:38:54+05:30 IST