Manoj Tiwary: రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న టీమిండియా క్రికెటర్.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-08-08T16:16:34+05:30 IST

భారత క్రికెటర్, పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీతో సమావేశం అనంతరం 37 ఏళ్ల తివారీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నేహాశిష్ గంగూలీ సూచన మేరకు తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయంపై మనసు మార్చుకున్నట్లు సమాచారం.

Manoj Tiwary: రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న టీమిండియా క్రికెటర్.. ఎందుకంటే..?

భారత క్రికెటర్, పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీతో సమావేశం అనంతరం 37 ఏళ్ల తివారీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నేహాశిష్ గంగూలీ సూచన మేరకు తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయంపై మనసు మార్చుకున్నట్లు సమాచారం. విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తివారీ అధికారికంగా ప్రకటించబోతున్నాడని తెలుస్తోంది. కాగా ఈ నెల 3న అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మనోజ్ తివారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనోజ్ తివారీ వంటి సీనియర్ ఆటగాడి సేవలను కోల్పోవడం బెంగాల్ రంజీ జట్టుకు మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. దీంతో స్నేహాశిష్ గంగూలీ నేరుగా రంగంలోకి దిగి తివారీతో చర్చలు జరిపాడు. రెండు గంటల చర్చ అనంతరం రిటైర్మెంట్ నిర్ణయంపై తివారీ వెనక్కి తగ్గాడు. దీంతో తివారీ వచ్చే రంజీ సీజన్ కూడా ఆడనున్నాడు. తివారీ కెప్టెన్సీలో గత రంజీ సీజన్‌లో బెంగాల్ జట్టు రనరఫ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గత పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తరఫున మనోజ్ తివారీ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో తివారీని సీఎం మమతా బెనర్జీ క్రీడా శాఖ మంత్రిని చేశారు. ఏది ఏమైనా మనోజ్ తివారీ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఇక 2004 డిసెంబర్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తివారీ ఇప్పటివరకు 141 మ్యాచ్‌లు ఆడాడు. 48 సగటుతో 9,908 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలున్నాయి. మరో 92 పరుగులు చేస్తే 10 వేల రన్స్ పూర్తి చేసుకుంటాడు. కాగా 2006-07 రంజీ ట్రోఫిలో మనోజ్ తివారీ దుమ్ములేపాడు. 99 సగటుతో 796 పరుగులు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో తివారీ 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. వన్డేల్లో 287 పరుగులు, టీ20ల్లో 15 పరుగులు చేశాడు. వన్డేల్లో 5 వికెట్లు తీశాడు. వన్డేల్లో ఓ సెంచరీ (104*) కూడా సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడిన తివారీ 28 సగటుతో 1695 పరుగులు చేశాడు.

Updated Date - 2023-08-08T16:21:36+05:30 IST