IND vs WI: వన్డే సిరీస్ గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా

ABN , First Publish Date - 2023-08-02T15:20:29+05:30 IST

మూడో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.

IND vs WI: వన్డే సిరీస్ గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా

ట్రినిడాడ్: మూడో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. కాగా వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది వరుసగా 13వ వన్డే సిరీస్ విజయం. 2007 నుంచి 2023 మధ్య కాలంలో భారత జట్టు ఈ విజయాలు సాధించింది. నిజానికి ఈ జాబితాలో టీమిండియా ఇది వరకే అగ్రస్థానంలో ఉంది. కానీ తాజా విజయంతో ఆ రికార్డును మరింత మెరుగుపరచుకుంది. ఈ జాబితాలో టీమిండియా తర్వాతి స్థానంలో పాకిస్థాన్ ఉంది. జింబాబ్వేపై పాక్ వరుసగా 11 వన్డే సిరీస్ విజయాలు సాధించింది. 1996-2021 మధ్య కాలంలో పాక్ ఈ విజయాలు సాధించింది. మూడో స్థానంలోనూ పాకిస్థానే ఉంది. వెస్టిండీస్‌పై ఆ జట్టు వరుసగా 10 వన్డే సిరీస్ విజయాలు సాధించింది. 1999-2022 మధ్య కాలంలో పాక్ ఈ విజయాలు సాధించింది. ఇక నాలుగో స్థానంలో మళ్లీ టీమిండియానే ఉంది. భారత జట్టు శ్రీలంకపై వరుసగా 10 వన్డే సిరీస్ విజయాలు సాధించింది. 2007-2023 మధ్య కాలంలో టీమిండియా ఈ విజయాలను నమోదు చేసింది.


ఇక చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత కుర్రాళ్లు ఏకంగా 200 పరుగుల భారీ తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. పరుగుల పరంగా వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం కావడం గమనార్హం. మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శుభ్‌మన్ గిల్(85), ఇషాన్ కిషన్(77), హార్దిక్ పాండ్యా(70), సంజూ శాంసన్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్య చేధనలో35.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 151 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, ముఖేష్ కుమార్ 3, కుల్దీప్ యాదవ్ 2, జయదేవ్ ఉనద్కత్ ఒక వికెట్ పడగొట్టారు. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

Updated Date - 2023-08-02T15:20:29+05:30 IST