T20 IPL stars: టీమిండియా సరికొత్తగా..

ABN , First Publish Date - 2023-08-18T04:17:18+05:30 IST

కరీబియన్‌ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌(Five T20 series) ముగిసిందో.. లేదో క్రికెట్‌ ప్రేమికులకు మరోసారి వినోదాన్ని పంచేందుకు టీమిండియా (Team India) సిద్ధమవుతోంది.

T20  IPL stars:  టీమిండియా  సరికొత్తగా..

ఐపీఎల్‌ స్టార్లతో బరిలోకి

కెప్టెన్‌ బుమ్రాపైనే అందరి దృష్టి

నేటి నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌

రాత్రి 7.30 నుంచి జియో సినిమాలో..

టీ20ల్లో తొలిసారి భారత కెప్టెన్‌గా వ్యవహరించనున్న పేసర్‌ బుమ్రా

డబ్లిన్‌: కరీబియన్‌ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌(Five T20 series) ముగిసిందో.. లేదో క్రికెట్‌ ప్రేమికులకు మరోసారి వినోదాన్ని పంచేందుకు టీమిండియా (Team India) సిద్ధమవుతోంది. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ శుక్రవారం ప్రారంభం కానుంది. అయితే ఈసారి జట్టులో రెగ్యులర్‌ స్టార్లు లేరు. 11 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టు బరిలోకి దిగనుంది. పనిఒత్తిడిని తగ్గించడంలో భాగంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌(Captain Hardik)కు విశ్రాంతినిచ్చారు. ముఖ్యంగా వెన్నునొప్పి నుంచి కోలుకున్నాక బుమ్రా ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ లయకు ఈ మ్యాచ్‌లు పరీక్ష కానున్నాయి. వన్డే వరల్డ్‌క్‌పనకు రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో అతడిపై సెలెక్టర్లు ఓ అంచనాకు రావాలనుకుంటున్నారు. అందుకే అందరి దృష్టీ అతడిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక ఐపీఎల్‌ స్టార్లు రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ, రుతురాజ్‌, శివమ్‌ దూబేలకు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌ చక్కటి అవకాశం కానుంది. మరోవైపు భారత జట్టుపై ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఐర్లాండ్‌ జట్టు ఈ సిరీ్‌సలో ఏమాత్రం పోటీనిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే పొట్టి ఫార్మాట్‌లో అదరగొట్టే ఆటగాళ్లు జట్టులో ఉండడంతో వీరిని తేలిగ్గా తీసుకుంటే భంగపాటు తప్పదు.

Untitled-8.jpg

శాంసన్‌ వర్సెస్‌ జితేశ్‌:

జాతీయ జట్టులో చోటును పటిష్ఠం చేసుకునేందుకు కుర్రాళ్లకు ఈ సిరీస్‌ తోడ్పడనుంది. ఆసియా గేమ్స్‌లో తలపడే జట్టులోనూ ఈ బృందమే ఉండడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా స్వర్ణం సాధించే తుది కూర్పుపై అవగాహన వస్తుంది. అయితే ఐపీఎల్‌లో అదరగొట్టే సంజూ శాంసన్‌కు కరీబియన్‌ టూర్‌లో పలు అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. అందుకే ఈ సిరీ్‌సలో అతడి స్థానంపై సందేహం నెలకొంది. తనకు మరో వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ నుంచి గట్టి పోటీ నెలకొంది. అలాగే రింకూ సింగ్‌ ఆటను అంతర్జాతీయ స్థాయిలో చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. రుతురాజ్‌, జైస్వాల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. బౌలింగ్‌ విభాగంలో పేసర్‌ ప్రసిద్ధ్‌ క్రిష్ణకు కూడా ఇది కమ్‌బ్యాక్‌ సిరీస్‌ కానుంది. ఆసియాక్‌పలో టీమ్‌ను ఎంపిక చేయాల్సిన తరుణంలో తన ప్రదర్శన కూడా సెలెక్టర్లు గమనించనున్నారు. అర్ష్‌దీప్‌, ముకేశ్‌, అవేశ్‌ ఇతర పేసర్లు కాగా బిష్ణోయ్‌, షాబాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ విభాగంలో పోటీపడనున్నారు.

పటిష్ట జట్టుతో..:

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించాక ఐర్లాండ్‌కిదే తొలి సిరీస్‌. అందుకే భారత్‌తో పోటీపడేందుకు తమ అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. పాల్‌ స్టిర్లింగ్‌కు జట్టు పగ్గాలు అప్పచెప్పగా.. గాయం నుంచి కోలుకున్న లెగ్‌ స్పిన్నర్‌ గ్యారెత్‌ డెలానీకి చోటిచ్చారు. బ్యాటింగ్‌లో బల్బిర్నీ, అడెయిర్‌, స్టిర్లింగ్‌ కీలకం కానుండగా.. ఇక హ్యారీ టెక్టర్‌, టక్కర్‌ భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను వణికించగల సమర్థులు. అలాగే సీమర్‌ జోష్‌ లిటిల్‌కు ఐపీఎల్‌లో గుజరాత్‌కు ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు భారత జట్టుపై తన సత్తాను ప్రదర్శించాలనుకుంటున్నాడు.


హాట్‌కేకుల్లా టిక్కెట్ల అమ్మకం

భారత్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌ టిక్కెట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ఈనేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌ల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోవడం విశేషం. భారత జట్టులో స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా అభిమానుల నుంచి ఇంత డిమాండ్‌ ఏర్పడడంతో నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రీలంకలో జరిగే ఆసియాకప్‌ టిక్కెట్ల అమ్మకం కూడా గురువారం ఆరంభమైంది. ఇందులో సెప్టెంబరు 2న జరిగే భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ కూడా ఉండడంతో అభిమానుల నుంచి ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌:

రుతురాజ్‌, జైస్వాల్‌, తిలక్‌ వర్మ, దూబే, రింకూ సింగ్‌, శాంసన్‌/జితేశ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ క్రిష్ణ, బుమ్రా (కెప్టెన్‌).

ఐర్లాండ్‌:

బల్బిర్నీ, స్టిర్లింగ్‌ (కెప్టెన్‌), టక్కర్‌, టెక్టర్‌, కాంఫర్‌, హ్యాండ్‌, డాక్‌రెల్‌, అడెయిర్‌, మెక్‌కార్తి, లిటిల్‌, వైట్‌.

పిచ్‌:

ఇక్కడి విలేజ్‌ క్రికెట్‌ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కీలకం కానున్నారు.

Updated Date - 2023-08-18T06:02:44+05:30 IST