IND vs WI: అశ్విన్ ఖాతాలో 6 రికార్డులు.. మొదటి రోజు ఆటను శాసించిన ఆఫ్‌ స్పిన్నర్

ABN , First Publish Date - 2023-07-13T11:20:50+05:30 IST

వెస్టిండీస్‌తో ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5/60) దుమ్ములేపాడు. తన స్పిన్ మాయజాలంతో విండీస్ బ్యాటర్లను వణికించడమే కాకుండా తొలి రోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మొదటి రోజు ఆటను ఈ ఆఫ్ స్పిన్నర్ శాసించాడనే చెప్పుకోవాలి.

IND vs WI: అశ్విన్ ఖాతాలో 6 రికార్డులు.. మొదటి రోజు ఆటను శాసించిన ఆఫ్‌ స్పిన్నర్

డొమినికా: వెస్టిండీస్‌తో ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5/60) దుమ్ములేపాడు. తన స్పిన్ మాయజాలంతో విండీస్ బ్యాటర్లను వణికించడమే కాకుండా తొలి రోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మొదటి రోజు ఆటను ఈ ఆఫ్ స్పిన్నర్ శాసించాడనే చెప్పుకోవాలి. మరోవైపు అశ్విన్‌కు మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా(3/26) కూడా సహకరించడంతో తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను టీమిండియా తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. ఆ తర్వాత ఓపెనర్లు శుభారంభాన్ని అందించడంతో తొలి రోజు ఆటలో టీమిండియా పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించింది.


ఇక అశ్విన్(Ravichandran Ashwin) సాధించిన ఆరు రికార్డుల విషయానికొస్తే..

702- మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో 700 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీమిండియా తరఫున 700 వికెట్లను పూర్తి చేసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(956), హర్బజన్ సింగ్ (711) ఉన్నారు.

33- తొలి రోజు ఆటలో అశ్విన్ 5 వికెట్లతో చెలరేగాడు. టెస్ట్ క్రికెట్‌లో 5 వికెట్లను తీయడం అశ్విన్‌కు ఇది 33వ సారి. దీంతో టెస్ట్ క్రికెట్‌లో ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక సార్లు 5 వికెట్ల హాల్‌ను అందుకున్న బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 32 సార్లు 5 వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను అధిగమించాడు.

5- టెస్టుల్లో వెస్టిండీస్‌పై 5 వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది ఐదో సారి. దీంతో వెస్టిండీస్‌పై అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో హర్బజన్ సింగ్‌తో కలిసి అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు.

95- మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ఓపెనర్ చంద్రపాల్‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా టెస్టుల్లో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా వికెట్ సాధించడం అశ్విన్‌కు ఇది 95వ సారి. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లను క్లీన్‌ బౌల్డ్ ద్వారా సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్సిన్నర్ అనిల్ కుంబ్లే (94)ను అధిగమించాడు.

5- విండీస్ ఓపెనర్ టాగెనరైన్ చందర్‌పాల్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్ట్‌లో తండ్రి కొడుకులను ఔట్ చేసిన అరుదైన ఘనతను అశ్విన్ సొంతం చేసుకున్నాడు.12 ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన తన అరంగేట్ర టెస్ట్‌లో తేజ్‌నరైన్‌ తండ్రి శివ్‌ నరైన్‌ చందర్‌పాల్‌ను అశ్విన్‌ ఔట్ చేశాడు. దీంతో టెస్టుల్లో తండ్రి కొడుకులను ఔట్ చేసిన ఐదో బౌలర్‌గా, మొదటి భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు ఈ ఘనతను ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, మిచెల్ స్టార్క్, సైమన్ హార్మర్ సాధించారు.

3- టెస్ట్ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ గడ్డపై 5 వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది మూడో సారి. దీంతో వెస్టిండీస్‌ గడ్డపై అత్యధిక సార్లు 5 వికెట్ల హాల్‌ను అందుకున్న ఐదో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు ఈ జాబితాలో సుభాష్ గుప్తే, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మ ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే అశ్విన్ స్పిన్ మాయజాలానికి మిగతా బౌలర్లు కూడా తోడవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 150 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (20), చంద్రపాల్‌ను(12)ను అశ్విన్ వెంట వెంటనే పెవిలియన్ చేర్చడంతో వెస్టిండీస్ వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత జడేజా, శార్దూల్ ఠాకూర్ కూడా వరుసగా వికెట్లు తీయడంతో 76 పరుగులకే విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో విండీస్‌ను అలిక్‌ అథనజె(47), హోల్డర్ (18) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే 50వ ఓవర్‌లో హోల్డర్‌ను పెవిలియన్ చేర్చిన సిరాజ్ ఈ పాట్నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ మరోసారి చెలరేగడంతో విండీస్ ఆలౌటవడానికి ఎంతో సమయం పట్టలేదు. క్రీజులో కుదురుకున్న అలిక్‌ అథనజెను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన విండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. 47 పరుగులు చేసిన అలిక్ అథనజె టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా జడేజా 3, సిరాజ్, ఠాకూర్ తలో వికెట్ తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 80-0 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(30), యశస్వి జైస్వాల్ (40) క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-07-13T11:35:32+05:30 IST