Captain Rohit Sharma: ప్రయోగాలకే చాన్స్‌!

ABN , First Publish Date - 2023-07-29T02:53:41+05:30 IST

‘మా ఆటగాళ్లకు తగిన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించాలనేదే మా ఉద్దేశం. ఇందుకోసం వీలైనప్పుడల్లా అవకాశాలిస్తుంటాం’.. తొలి వన్డే ముగిశాక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలివి.

Captain Rohit Sharma: ప్రయోగాలకే  చాన్స్‌!

నేడు విండీస్‌తో రెండో వన్డే

రాత్రి 7 గంటల నుంచి

డీడీ స్పోర్ట్స్‌లో..గెలిస్తే భారత్‌దే సిరీస్‌

బ్రిడ్జిటౌన్‌: ‘మా ఆటగాళ్లకు తగిన మ్యాచ్‌ ప్రాక్టీస్‌i(Match practice) లభించాలనేదే మా ఉద్దేశం. ఇందుకోసం వీలైనప్పుడల్లా అవకాశాలిస్తుంటాం’.. తొలి వన్డే ముగిశాక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Captain Rohit Sharma) చేసిన వ్యాఖ్యలివి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటింగ్‌(Indian batting) ఆర్డర్‌ పూర్తిగా మారింది. మిడిలార్డర్‌ ఆటగాళ్లను ముందే పంపించి రోహిత్‌ పదేళ్ల తర్వాత ఏడో నెంబర్‌లో బరిలోకి దిగగా.. కోహ్లీ(Kohli) అసలు బ్యాటింగే చేయలేదు. వన్డే ప్రపంచకప్‌(World Cup) సమీపిస్తుండడంతో యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు చేసిన ప్రయత్నమిది. ఈనేపథ్యంలో శనివారం వెస్టిండీ్‌స(West Indies)తో జరిగే రెండో వన్డేలోనూ టీమిండియా ప్రయోగాలు చేయాలనుకుంటోంది. అలాగే ఇందులో గెలిస్తే సిరీస్‌ వశమవుతుంది. అదే జరిగితే.. ఆఖరి మ్యాచ్‌కు వెటరన్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి పూర్తిగా యువ ఆటగాళ్లనే ఆడించినా ఆశ్చర్యం లేదు. అటు గురువారం ఆటలో విండీస్‌ బౌలర్లు (Windies bowlers)మెరుగ్గానే రాణించినా బ్యాటర్లు విఫలం కావడం ఆతిథ్య జట్టును దెబ్బతీసింది. తొలి మ్యాచ్‌లో విండీస్‌ కనీసం 200 పరుగులైనా చేసుంటే భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యేదేమో..


ఆత్మవిశ్వాసంతో..:

ఈ మ్యాచ్‌కు భారత జట్టులో మార్పులుండకపోవచ్చు. అయితే 115 పరుగుల ఛేదనలో ఇషాన్‌(Ishaan) జోరు చూపినా మిగతా బ్యాటర్లు మాత్రం ఇబ్బందిపడడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనపరుస్తోంది. సునాయాసంగా మ్యాచ్‌ను ముగిస్తారనుకున్నా.. ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. సూర్యకుమార్‌ ఎప్పటిలాగే నిరాశపరిచాడు. శ్రేయాస్‌, రాహుల్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే అతడి స్థానం గల్లంతవుతుంది. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్ల హవా కన్పించింది. చాహల్‌ను కాదని జట్టులో చోటు దక్కించుకున్న కుల్దీప్‌ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అటు పేసర్‌ ముకేశ్‌ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. తన మొదటి ఓవర్‌నే మెయిడిన్‌గా వేయడంతో పాటు ఓవరాల్‌గా కెరీర్‌లో తొలి వికెట్‌ను కూడా సాధించాడు.

పోటీనిస్తారా?

రెండో వన్డేలో భారత్‌ను సవాల్‌ చేయాలంటే విండీస్‌ తమ స్థాయికి మించి ఆడాల్సిందే. టాప్‌-5 ఆటగాళ్లలో నలుగురు రెండంకెల స్కోర్లు చేసినా.. ఎక్కువ సమయం క్రీజులో నిలువలేకపోయారు. కెప్టెన్‌ హోప్‌ ఒంటరి పోరాటం ఫలితాన్నివ్వలేదు. అయితే బౌలర్లు మాత్రం భారత బ్యాటర్లను బాగానే ఇబ్బందిపెట్టారు. స్పిన్నర్లు మోటీ, కారియా పరుగులను కట్టడి చేయడంతో పాటు వికెట్లు తీయగలిగారు. ఇక నేటి మ్యాచ్‌లో బ్యాటర్‌ మేయర్స్‌ స్థానంలో కాసీ కార్టీ ఆడే అవకాశం ఉంది.

జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌, సూర్యకుమార్‌, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, ఉమ్రాన్‌, ముకేశ్‌.

విండీస్‌:

బ్రాండన్‌ కింగ్‌, అథనజె, హోప్‌ (కెప్టెన్‌), కార్టీ, హెట్‌మయెర్‌, పావెల్‌, షెఫర్డ్‌, డ్రేక్స్‌, కారియా, మోటీ, సీల్స్‌.

పిచ్‌, వాతావరణం

తొలి మ్యాచ్‌లో ఇక్కడి పిచ్‌ బౌన్స్‌తో పాటు టర్న్‌ కావడంతో పేసర్లు, స్పిన్నర్లు రాణించారు. ఈసారి టాస్‌ గెలిస్తే భారత్‌ బ్యాటింగ్‌ తీసుకునే చాన్స్‌ ఉంది. ఒకవేళ బంతి టర్న్‌ అయితే బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది తేలనుంది. మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించే అవకాశముంది.

Updated Date - 2023-07-29T04:43:31+05:30 IST