Viral Video: సీనియర్లే కాదు జూనియర్లు కూడా తోపే!.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు మెరుపు ఫీల్డింగ్..

ABN , First Publish Date - 2023-07-19T20:23:30+05:30 IST

ఫీల్డర్లు గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్‌లు అందుకోవడం మనం అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్ వంటి వాటిల్లో చూశాం. కానీ జూనియర్ క్రికెట్ లెవల్లో సైతం ఫీల్డింగ్‌లో కుర్రాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. సీనియర్లకు తామేమి తక్కువ కాదన్నట్టుగా తమదైన ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.

Viral Video: సీనియర్లే కాదు జూనియర్లు కూడా తోపే!.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు మెరుపు ఫీల్డింగ్..

కొలంబో: ఫీల్డర్లు గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్‌లు అందుకోవడం మనం అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్ వంటి వాటిల్లో చూశాం. కానీ జూనియర్ క్రికెట్ లెవల్లో సైతం ఫీల్డింగ్‌లో కుర్రాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. సీనియర్లకు తామేమి తక్కువ కాదన్నట్టుగా తమదైన ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. అలాంటి మెరుపు ఫీల్డింగే తాజాగా ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భాగంగా భారత్-ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ కనిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు హర్షిత్ రానా అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు హర్షిత్ రానాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


పాకిస్థాన్ జట్టు 95 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో ముబాసిర్ ఖాన్, మెహ్రాన్ ముంతాజ్‌తో కలిసి ఖాసిం అక్రమ్ జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ వేసిన 46వ ఓవర్లో ఆఫ్ సైడ్‌గా వచ్చిన బంతిని పాక్ బ్యాటర్ ఖాసిం అక్రమ్ వికెట్ల వెనుకకు భారీ షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి బౌండరీ వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హర్షిత్ రానా గాల్లోకి డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఖాసిం అక్రమ్ షాక్‌కు గురికాక తప్పలేదు. అద్భుత క్యాచ్‌ పట్టిన హర్షిత్ రానాను సహచర ఆటగాళ్లతోపాటు మైదానంలోని ప్రేక్షకులు అభినందించారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫీల్డింగ్‌లో సీనియర్లే కాదు.. జూనియర్లు కూడా తోపే’ అంటూ హర్షిత్ రానాను కొనియాడుతున్నారు. హర్షిత్ రానా అద్భుత క్యాచ్‌తో ఖాసిం అక్రమ్ 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దే వెనుదిరిగాల్సి వచ్చింది. దీంతో 191 పరుగుల వద్ద పాకిస్థాన్ 8వ వికెట్ కోల్పోయింది. ఖాసిం అక్రమ్ ఔట్ తర్వాత పాక్ ఆలౌటవడానికి ఎంతో సమయం పట్టలేదు. 205 పరుగుల వద్ద ఆ జట్టు ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ 5 వికెట్లతో చెలరేగగా.. మానవ్ సుతార్ 3 వికెట్లతో సత్తా చాటాడు.

Updated Date - 2023-07-19T20:27:25+05:30 IST