Team India: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. గాయం కారణంగా స్టార్ బౌలర్ ఔట్!
ABN , First Publish Date - 2023-09-13T21:10:42+05:30 IST
తొలి సారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ పేసర్ శివమ్ మావి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
తొలి సారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ పేసర్ శివమ్ మావి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలున్నాయి. నిజానికి గాయపడిన శివమ్ మావి స్థానంలో ఆసియా క్రీడలకు స్టాంట్ బైగా ఎంపికైన యష్ ఠాకూర్‌ను తీసుకోవాలని ముందుగా భావించారు. కానీ విదర్భకు చెందిన యష్ ఠాకూర్ కూడా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. దీంతో సెలెక్టర్లు ఉమ్రాన్ మాలిక్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. కాగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో 19వ ఆసియా క్రీడల పరుషుల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. టోర్నీకి రెండు వారాల ముందే రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లంతా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ వారు వీవీఎస్ లక్ష్మణ్, సరియాజ్ బహుతులే, మునీష్ బాలి, సరియాజ్ బహుతులే పర్యవేక్షణలో సాధన చేస్తున్నారు. ఇక ఆసియా క్రీడలు జరిగే సమయంలో టీమిండియా సీనియర్ జట్టు వన్డే ప్రపంచకప్‌లో బిజీగా ఉంటుంది. దీంతో ఇండియా ద్వితీయ జట్టును ఈ టోర్నీకి ఎంపిక చేశారు.
భారత జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్)