Tech tips: ఆధార్ కార్డు పొగొట్టుకున్నారా? డొంట్ వర్రీ.. స్మార్ట్ ఫోన్ ద్వారా 10 నిమిషాల్లో తిరిగి పొందే మార్గాలిదిగో!
ABN , First Publish Date - 2023-08-16T18:13:54+05:30 IST
ఆధార్ కార్డు కనిపించకుండా పోయినా, ఆధార్ నంబర్ గుర్తు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నంబర్ గుర్తు లేకున్నా, కనిపించకుండా పోయినా ఆధార్ కార్డు తిరిగి పొందడానికి చాలా మార్గాలే ఉన్నాయి.
ప్రస్తుతం ప్రతి భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు అనేది ప్రతి భారతీయుడి ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఆధార్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా ప్రయోజనాలు అందుతాయి. ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగమైనా, ఏ చిన్న అవసరానికైనా సరే ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఒక వేళ లేకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే అలాంటి ఆధార్ కార్డు కనిపించకుండా పొతే పరిస్థితి ఏంటి? తిరిగి ఆధార్ కార్డును పొందడం ఎలా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఉంటుంది. ఇక ఆధార్ కార్డు పొగొట్టుకున్న వారైతే తిరిగి పొందడానికి చాలా తిప్పలే పడతారు. అయితే ఆధార్ కనిపించకుండా పోయినా దాని నంబర్ ఉంటే తిరిగి పొందొచ్చని పలువురు చెబుతారు. కానీ పలువురికి ఆధార్ నంబర్ కూడా గుర్తు ఉండదు. మరి అలాంటి వాళ్లు ఆధార్ కార్డు తిరిగ పొందడం ఎలా? అనేది అసలు ప్రశ్న.
నిజానికి ఆధార్ కార్డు కనిపించకుండా పోయినా, ఆధార్ నంబర్ గుర్తు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నంబర్ గుర్తు లేకున్నా, కనిపించకుండా పోయినా ఆధార్ కార్డు తిరిగి పొందడానికి చాలా మార్గాలే ఉన్నాయి. ఆధార్ కార్డు నంబర్ మాత్రమే కాకుండా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఆధార్ వర్చువల్ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్‌ని ఉపయోగించి స్మార్ట్ ఫోన్ ద్వారా 10 నిమిషాల్లో వారి ఆధార్‌ను తిరిగి పొందవచ్చు. దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఇ-ఆధార్ లేదా పీవీసీ ఆధార్ కార్డ్‌ను పొందవచ్చు. ఆధార్ నంబర్ తెలిసిన వ్యక్తులు తమ ఇ-ఆధార్‌ను నేరుగా యూఐడీఏఐ (UIDAI) వెబ్‌సైట్ ద్వారా లేదా ఎమ్ఆధార్ (mAadhaar) యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పీవీసీ ఆధార్ కార్డుకు దరఖాస్తు చేస్తేకుంటే 15 రోజుల్లో నేరుగా ఇంటికే వస్తుంది. కానీ దీనికి ఆన్‌లైన్‌లో రూ.50 కట్టాల్సి ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ ద్వారా ఆధార్‌ను తిరిగి పొందే మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
eAadhaarని ఎలా పొందాలంటే..?
myaadhaar.uidai.gov.in/UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి
"డౌన్‌లోడ్ ఆధార్"పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 4 అంకెల ఓటీపీ (OTP) నంబర్ వస్తుంది. దానిని నమోదు చేయండి.
OTPని నమోదు చేసి "సబ్‌మిట్"పై(Submit) క్లిక్ చేయండి.
మీ ఇ-ఆధార్ పీడీఎఫ్ (PDF) ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
అవసరమైదే ఆ PDF ఫైల్‌ను సేవ్ చేసుకోవచ్చు.
eAadhaarను mAadhaar యాప్ ద్వారా ఎలా పొందాలంటే..?
గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేదా యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store) నుంచి mAadhaar యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్‌ని ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్, బయోమెట్రిక్‌లతో సైన్ ఇన్ అవ్వండి
"నా ఆధార్"పై(My Aadhaar) క్లిక్ చేయండి.
"డౌన్‌లోడ్ ఆధార్" కింద, "ఇ-ఆధార్"పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 4 అంకెల OTP నంబర్ వస్తుంది.
మీ OTPని నమోదు చేసి "సబ్‌మిట్"పై క్లిక్ చేయండి.
మీ ఇ-ఆధార్ పీడీఎఫ్ (PDF) ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
అవసరమైదే ఆ PDF ఫైల్‌ను సేవ్ చేసుకోవచ్చు.
పీవీసీ(PVC) ఆధార్ కార్డు ఎలా పొందాలంటే..?
UIDAI వెబ్‌సైట్ atuidai.gov.in/కి వెళ్లండి.
"మై ఆధార్" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
"ఆర్డర్ ఆధార్ PVC కార్డ్" కింద ఉన్న "ఇప్పుడే ఆర్డర్ చేయి"పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేయండి.
"ప్రొసీడ్"పై(Proceed) క్లిక్ చేయండి.
మీ చిరునామా, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
"సబ్‌మిట్" పై క్లిక్ చేయండి.
మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTPని నమోదు చేసి, "ధృవీకరించి"పై(Verify) క్లిక్ చేయండి.
రూ.50 ఫీజ్ చెల్లించమని అడుగుతుంది.
"ఇప్పుడే చెల్లించు"పై క్లిక్ చేయండి. డబ్బును చెల్లించండి.
ఆ తర్వాత మీ మొబైల్‌కు పీవీసీ ఆధార్ కార్డు బుక్ అయినట్టుగా ఒక సందేశం వస్తుంది.
మీ PVC ఆధార్ కార్డ్ 15 పని దినాలలో మీ చిరునామాకు డెలివరీ అవుతుంది.