Hyderabad : తార్నాకలో దారుణం.. యువతికి లిఫ్ట్ ఇచ్చి లైంగిక దాడి.. బైక్‌పై నుంచి దూకడంతో..
ABN , First Publish Date - 2023-07-03T19:13:41+05:30 IST
భాగ్యనగరంలో (Hyderabad) పోకిరీలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకూ కీచకుల ఆగడాలు పెరిగిపోతుండటంతో ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఆడవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో రోజుకో దారుణ ఘటన జరుగుతుండగా.. తాజాగా తార్నాకలో (Tarnaka) కామాంధుడు చేసిన పనికి ఓ యువతి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది...
హైదరాబాద్ : భాగ్యనగరంలో (Hyderabad) పోకిరీలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకూ కీచకుల ఆగడాలు పెరిగిపోతుండటంతో ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఆడవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో రోజుకో దారుణ ఘటన జరుగుతుండగా.. తాజాగా తార్నాకలో (Tarnaka) కామాంధుడు చేసిన పనికి ఓ యువతి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తివివరాల్లోకెళితే.. తార్నాకలో ఆర్తి అనే యువతి పాలడబ్బా తెచ్చేందుకు బయటికి వెళ్లింది. అయితే మెడికల్ షాపు మూసి ఉండటంతో ఆటో కోసం రోడ్డు మీద ఎదురుచూస్తుండగా ఇంతలో ఓ యువకుడు బైక్‌పై వచ్చాడు. మెడికల్ షాప్ గురించి అతడ్ని అడగ్గా.. కొంచెం ముందుకెళ్తే ఉందని, అక్కడిదాకా లిఫ్ట్ ఇస్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. అతడ్ని నమ్మి బైక్ ఎక్కడమే ఆర్తి తప్పయ్యింది..!. కొంచెం దూరం వెళ్లాక సల్మాన్ హోటల్ దగ్గర యువతిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. తన రూమ్‌కు రావాలని అసభ్యంగా మాట్లాడటంతో తప్పించుకునే ప్రయత్నంలో బైక్‌పై నుంచి దూకేసింది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఆమెపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆర్తికి తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు, కేకలు వేయడంతో విషయం గమనించిన స్థానికులు హుటాహుటిన ఆర్తిని స్థానికంగా ఉన్న గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. తమకు న్యాయం చేయాలని పోలీసులు, ప్రభుత్వాన్ని ఆర్తి తల్లిదండ్రులు కోరుతున్నారు. తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లను ఆమె తల్లి వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. యువతి స్పృహలో లేకపోవడంతో ఎలాంటి వివరాలు తెలియట్లేదు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉస్మానియా పోలీసులు నిందితుడ్ని అదుపులోనికి తీసుకున్నారు. అయితే.. జూన్-26న అర్ధరాత్రి 11 గంటల సమయంలోఈ ఘటన జరగ్గా ఆలస్యం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.