Share News

Telangana Election: పైసా మే ప్రచారం

ABN , First Publish Date - 2023-11-17T05:33:15+05:30 IST

పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచుతూ క్షణం తీరిక లేకుండా క్యాంపెయినింగ్‌ చేస్తున్నాయి. రోజుకో కొత్త వ్యూహంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Telangana Election: పైసా మే ప్రచారం

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్‌ చానళ్ల అభిప్రాయ సేకరణకు డబ్బు డిమాండ్‌ చేస్తున్న జనం

ఆయా చానళ్లకు కావాల్సిన విధంగా మాట్లాడ్డానికి రూ.300 నుంచి 500 దాకా పుచ్చుకుంటున్న వైనం

సభలకు వచ్చినందుకు డబ్బులివ్వకుంటే నిలదీస్తున్న ప్రజలు.. డప్పు కళాకారులు, కోలాట బృందాలకు గిరాకీ

పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచుతూ క్షణం తీరిక లేకుండా క్యాంపెయినింగ్‌ చేస్తున్నాయి. రోజుకో కొత్త వ్యూహంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితం ఎలా వచ్చినా ప్రయత్నలోపం మాత్రం ఉండకూడదనే ఉద్దేశంతో.. ప్రచారంలో ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. పలు యూట్యూబ్‌ చానళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుని, వారితో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి.. అందులో తమకు అనుకూలంగా చెప్పినవారి మాటలనే ప్రచారం చేసేలా చూసుకుంటున్నారు. పాత్రికేయ ప్రమాణాలు ఏమాత్రం లేని కొన్ని యూట్యూబ్‌ చానళ్లు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీన్ని పసిగట్టిన ఓటర్లు.. పరిస్థితులను సొమ్ము చేసుకుంటున్న యూట్యూబ్‌ చానళ్ల ఆరాటాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రచారం నిమిత్తం తాము బేరం కుదుర్చుకున్న పార్టీలు/అభ్యర్థుల సభలు, సమావేశాలకు వెళ్తున్న సదరు యూట్యూబ్‌ చానళ్ల ప్రతినిధులు అభిప్రాయాలు అడిగినప్పుడు.. ‘‘మీరు ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి అనుకూలంగా చెప్పమంటే ఆ పార్టీకి/అభ్యర్థికి అనుకూలంగా మా అభిప్రాయం చెబుతాం. కానీ, అందుకు మాకు రూ.300 ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేస్తున్నారు. కొందరైతే రూ.500 దాకా కూడా డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.

పైసలియ్యకుంటే ఊరుకునేది లేదు

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు.. తాము నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి మరీ జన సమీకరణ చేస్తున్నారు. అయితే.. కొన్ని చోట్ల పిలిచినదానికన్నా ఎక్కువ మంది ప్రచారానికి వస్తుండగా, మరికొన్ని చోట్ల అనుకున్నంత మంది రావట్లేదు. ఉదాహరణకు.. ఇటీవల ఓ అభ్యర్థి తన నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో నిర్వహించే ప్రచారానికి 200 మందిని సమీకరించాలని స్థానిక నేతకు చెప్పారు. తీరా ఆయన అక్కడికి వెళ్లేసరికి 400 మంది వచ్చారు. ‘ఇదేంటి ఇంతమందిని తీసుకొచ్చార’ని అడగ్గా.. ‘మేము పిలిచింది 200 మందినే. కానీ ఎక్కువ వచ్చారు. వచ్చినవారందరికీ డబ్బులు ఇవ్వాల్సిందే. లేకుంటే మనపై వ్యతిరేకత వస్తుంది’ అని సదరు స్థానిక నేత చెప్పడంతో ఆ అభ్యర్ధి కంగుతిన్నాడు. సభలు, సమావేశాలకు వచ్చిన జనం.. ఇస్తామన్న మేర పైసలు ఇవ్వకపోతే ఊరుకోవడంలేదు. అభ్యర్థులతో, స్థానిక నాయకులతో వాగ్వాదాలకు సైతం దిగుతున్నారు.

డప్పు దరువులు.. కోలాటాల సందడి..

గ్రామీణ ప్రాంతాల్లో జనాన్ని ఆకర్షించేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలను, కళారూపాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు.. డీజేలను ప్రచారంలో అధికంగా వాడుతున్నారు. ప్రచారం కోసం సిద్ధం చేసిన ర్యాప్‌ పాటలు, ఇతర పాటలతో ప్రచార వాహనాలను విస్తృతంగా తిప్పుతున్నారు. తీన్‌మార్‌ డప్పు దరువులతో, కోలాట బృందాల సందడితో.. పలువురు అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. బతుకమ్మ పండుగ కోసం నేర్చుకున్న కోలాటం ఎన్నికల సమయంలో చాలామందికి ఆర్థికంగానూ కలిసొస్తోంది. కాగా, పార్టీలు, అభ్యర్థుల ప్రచారాలకు వాహనాలే కీలకం. వివిధ పార్టీల అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన హామీల వివరాలు స్ఫుటంగా తెలిసేలా ఈ ప్రచార రథాలపై రాయించి నియోజకవర్గవ్యాప్తంగా గ్రామగ్రామానా తిప్పుతున్నారు. కొన్ని ప్రచార రథాలను.. అభ్యర్ధులు, కేడర్‌ కలిసి ప్రచారం చేసేందుకు వీలుగా ఉండేలా ప్రత్యేకంగా సిద్ధం చేయించుకుంటున్నారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రచారం చేసేందుకు చిన్న వాహనాలు వాడుతున్నారు. అభ్యర్ధి వివరాలతో వాటిని తీర్చిదిద్దడానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చవుతోంది. అదే ఓపెన్‌ టాప్‌, పెద్దవాహనాలను తీర్చిదిద్దడానికి రూ.లక్ష నుంచి 1.2 లక్షల దాకా ఖర్చు అవుతుందని మీడియా యాడ్స్‌ యజమాని పుసులూరి లెనిన్‌ తెలిపారు.

ప్రధాన అస్త్రం.. సోషల్‌ మీడియా..

మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా.. అన్ని పార్టీల అభ్యర్థులూ సోషల్‌ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలను వీలు ప్రకారం విభజించి వాటి పరిధిలో ఉన్న ఓటర్లతో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటుచేస్తున్నారు. వాటిలో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అభ్యర్థికి సంబంధించిన సందేశాలు, పార్టీ ఇచ్చిన హామీలు, గెలిపిస్తే ఆ ప్రాంతంలో ఫలానా పనులు చేయిస్తామంటూ సిద్ధం చేసిన వీడియో సందేశాలను పోస్ట్‌ చేస్తున్నారు. వీటితో పాటు పార్టీలు ఎప్పటికప్పుడు తయారుచేస్తున్న సోషల్‌ మీడియా వీడియోలను ఆ గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా పేజీలను ఏర్పాటుచేసి, నియోజకవర్గంలోని ఓటర్లందరికీ తెలిసేలా ఆ పేజీలను షేర్‌ చేస్తున్నారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌

ఎన్నికల హడావుడిని సొమ్ము చేసుకోవడానికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్‌ చానళ్లకే ప్రజలు ఝలక్‌ ఇస్తున్నారు! వారికి కావాల్సిన పార్టీకి, అభ్యర్థికి అనుకూలంగా అభిప్రాయం చెప్పాలంటే పైసలు ముట్టజెప్పాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. ఇదీ ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్‌. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది.


బొమ్మ బెలూన్‌ ఊపిరిలూదేనా!?

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. ప్రతి మహిళకూ రూ.2500; ప్రతి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు, తులం బంగారం: ప్రతి రైతుకు రూ.15 వేల రైతు బంధు; కౌలు రైతుకూ ఆర్థిక సాయం తదితర ఆరు గ్యారెంటీలపైనే కాంగ్రెస్‌ పూర్తిగా ఆధారపడింది! వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ పార్టీ నాయకులు వినూత్న ప్రచారం చేపట్టారు! నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం అమ్దాపూర్‌లో పథకాలను బ్రోచర్లు, బొమ్మల రూపంలో తయారు చేసి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.

బోధన్‌ రూరల్‌

దోశ సరే.. దశ తిరిగేనా!?

టీపీసీసీ ప్రచార కమిటీ కో-కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గురువారం ఖమ్మం నగరంలోని పెద్ద కూరగాయల మార్కెట్‌లో కూరలు అమ్మారు. అక్కడి టిఫిన్‌ సెంటర్లో దోశలు వేసి అక్కడికి వచ్చిన వారికి వడ్డించారు.

ఖమ్మం సంక్షేమ విభాగం

Updated Date - 2023-11-17T10:46:00+05:30 IST