Ponguleti : నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర!
ABN , First Publish Date - 2023-11-17T20:34:55+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు వందల కోట్లు పాలేరు నియోజకవర్గానికి పంపి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు వందల కోట్లు పాలేరు నియోజకవర్గానికి పంపి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు. శుక్రవారం నాడు పాలేరు నియోజకవర్గం ఆరెకోడులో పొంగులేటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ...‘‘నన్ను ఓడించేందుకు డబ్బు కట్టలు వెదజల్లుతున్నాడు..కేసీఆర్ నీ ఆటలు ఇక సాగవు. జనం కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన రాబోతోంది. కందాల ఉపేందర్‌రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపిస్తే కాళ్ల పారాణి ఆరక ముందే జంప్ జిలానీ చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి నెల తిరగకుండానే బీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో చేరామని కందాల చెప్పాడు. పాలేరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చెబుతావా కందాల. ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చావో చెప్పగలవా. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలను పెట్టి జనాన్ని ఇబ్బందులకు గురి చేశావు. నీ షాడో పాలనలో జనం కేసుల పాలయ్యారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది. పాలేరు ప్రజల కష్టాలు దూరం కాబోతున్నాయి’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.