Share News

TS Assembly Polls : తెలంగాణలో ముగిసిన ప్రచార ఘట్టం.. ఇక మిగిలింది రెండే..!

ABN , First Publish Date - 2023-11-28T17:11:21+05:30 IST

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. 2023 సాధారణ ఎన్నికల ప్రచార ఘట్టం నవంబర్-28న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. వీధుల్లో మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి ముగిసిపోయింది.

TS Assembly Polls : తెలంగాణలో ముగిసిన ప్రచార ఘట్టం.. ఇక మిగిలింది రెండే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. 2023 సాధారణ ఎన్నికల ప్రచార ఘట్టం నవంబర్-28న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. వీధుల్లో మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి ముగిసిపోయింది. స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. 119 నియోజకవర్గాలల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈనెల 30న ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సిందేనన్న నిబంధన ఉంది. ఇక ఓటర్లను ఎలాగైనా తమ వైపునకు మళ్లించుకునేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు చేశాయి.. ఇంకా చేస్తున్నాయి కూడా.! మిగిలిన కొద్ది గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.


అన్నీ బంద్!

మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. అలాగే 48 గంటల పాటు మద్యం షాపులను సైతం మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇవాళ (నవంబర్-28న) సాయంత్రం 5 నుంచే 30వ తేదీ సాయంత్రం 5 వరకు సైలెంట్‌ పీరియడ్‌లో టీవీ, సోషల్‌ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదని, పత్రికల్లో వేసే ప్రకటనలకు ఎంసీఎంసీ (మోడల్‌ కోడ్‌ మీడియా కమిటీ) ముందస్తు అనుమతి పొంది ఉండాలని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. 8 జిల్లాల పరిధిలో 600కు పైగా పోలింగ్‌ కేంద్రాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి.. అదనపు బలగాలను మోహరించారు.

ఇక్కడ ముందే..!

మరోవైపు.. తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ముందుగానే ఎన్నికల ప్రచారం ముగిసింది. 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగిసింది. ముఖ్యంగా.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌-03 న కౌంటింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఓ వైపు పోల్‌ మెనేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేసుకుంటూ.. మరోవైపు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయనే టాక్ గట్టిగానే నడుస్తోంది. అయితే.. డబ్బులు, మద్యం పంపిణీని ఎన్నికల యంత్రాంగం ఏ మేరకు నియంత్రిస్తుందో చూడాలి మరి.

Updated Date - 2023-11-28T17:11:23+05:30 IST