BRS: బీఆర్‌ఎస్ మహాధర్నా, మోదీ చిత్రపటం దహనం
ABN , First Publish Date - 2023-04-08T18:19:14+05:30 IST
సింగరేణి (Singareni)లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడం ద్వారా సంస్థ మనుగడను నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని
మంచిర్యాల: సింగరేణి (Singareni)లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడం ద్వారా సంస్థ మనుగడను నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (Allola Indrakaran Reddy) ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మోదీ రాకను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా సీసీసీ కార్నర్ వద్ద ‘బీజేపీ కో హఠావో...సింగరేణి కో బచావో’ నినాదంతో మహాధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటుపరం చేయవద్దని సీఎం కేసీఆర్ పలుమార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కార్మికులు బీజేపీ నేతలను గనుల వద్దకు రానియ్యవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం వాటిని అదానీకి అప్పగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో అవినీతి కొనసాగుతుందని, కేంద్రంతో కలిసి నడవడం లేదని మోదీ అనడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా తయారైందని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.
కేంద్రంలోనే అవినీతి ఉందని, కుట్రలు, కుతంత్రాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి సహకరించడం లేదన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు నిరంతర విద్యుత్, రైతుబీమా, పంట పెట్టుబడితో తెలంగాణ సస్యశ్యామలంగా ఉందన్నారు. తెలంగాణలో అవినీతి జరుగుతోందనడానికి సిగ్గుండాలని, దేశ వనరులను అదాని చేతిలో పెడుతూ అవినీతికి ఎలా పాల్పడుతున్నారో దేశమంతటికీ తెలుసన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆపలేరని ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ధర్నాకు సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం మోదీ చిత్రపటాన్ని బీఆర్‌ఎస్ నాయకులు దహనం చేశారు. మరోవైపు సింగరేణి అన్ని ఏరియాల్లోని గనుల వద్ద గో బ్యాక్ మోదీ అంటూ కార్మిక సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.