Vikarabad జిల్లాలో రెండుగా చీలిన బీఆర్ఎస్
ABN , First Publish Date - 2023-02-06T13:49:18+05:30 IST
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తం చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. ఎక్కడ చూసినా వర్గ పోరుతో పార్టీకి తల బొప్పి కడుతోంది.
వికారాబాద్ : ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని దేశ వ్యాప్తం చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ (KCR) వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు తెలంగాణ (Telangana)లోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. ఎక్కడ చూసినా వర్గ పోరుతో పార్టీకి తల బొప్పి కడుతోంది. దేశంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తలంపుతో కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతున్న సీఎం కేసీఆర్‌కు సొంత రాష్ట్రంలో సమస్యలు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి.
తాజాగా వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆరెస్ నాయకులు కొత్త తరహా రాజకీయానికి తెరదీశారు. బీఆర్ఎస్ పార్టీని రెండుగా చీల్చేశారు. పార్టీ నేతలు ఇరు వర్గాలుగా చీలిపోయి బలాబలాలు చూపేందుకు భారీ కాన్వాయ్ లతో హల్చల్ చేశారు. ఓ వైపు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వర్గం.. మరోవైపు డీసీసీబీ చైర్మైన్ మనోహర్ రెడ్డి వర్గం.. చిన్న కార్యక్రమాలకు వందల సంఖ్యలో కార్ల కాన్వాయ్ తో హల్చల్ చేశాయి. ఇక దీంతో బీఆర్ఎస్ తటస్థ కార్యకర్తల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. మొత్తంగా పరిస్థితి తాండూరును తలపిస్తోంది.