Yadadri: యాదాద్రి తిరువీధుల్లో కూల్‌పెయింట్
ABN , First Publish Date - 2023-05-15T20:42:22+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) పుణ్యక్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా కొనసాగాయి.
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) పుణ్యక్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వయంభువులను మేల్కొలిపిన ఆచార్యులు నిత్య కైంకర్యాలను నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభువులను, కవచమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ముఖమండపంలో ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ భవనంలో దేవస్థాన కార్యాలయం
యాదగిరిగుట్ట కొండపైన ఉత్తర దిశలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్ భవనంలోనికి దేవస్థాన వివిధ కార్యాలయాలను మార్పు చేశారు. వీవీఐపీల రాక నేపథ్యంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రోటోకాల్ కార్యాలయానికి కొండకు పడమటి దిశలో ఉన్న వీవీఐపీ అతిథి గృహంలోని ఓ గది కేటాయించారు. ఈ మేరకు దేవస్థాన అఽర్చకులు ఆయా కార్యాలయాల్లో సంప్రదాయరీతిలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్ని శాఖల అధికారులు నూతన కార్యాలయంలో తమ విధులను ప్రారంభించారు.
ఆలయ తిరువీధుల్లో కూల్‌పెయింట్
యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఆలయ తిరువీధుల్లో కూల్ పెయింట్‌ను వేయిస్తున్నారు. ఎండలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో ఈ చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆలయ తిరువీధుల్లో భక్తులు బయటకు వచ్చే దారిలో కూల్ పెయింట్‌ను వేస్తున్నారు. అదేవిధంగా రెడ్ కార్పెట్‌లను నీటితో తడుపుతున్నారు. ఎండాకాలంలో ఆలయ తిరువీధుల్లో చలువ పందిళ్లను వేయాలని భక్తులు కోరుతున్నారు.