Yadagirigutta: యాదగిరి క్షేత్రంలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2023-05-07T20:44:29+05:30 IST
యాదగిరిగట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigatta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం నిత్యారాధనలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.
యాదగిరిగుట్ట: యాదగిరిగట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigatta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం నిత్యారాధనలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. వేసవి సెలవులు రావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు (Devotees) పెద్దసంఖ్యలో దేవదేవుడి దర్శనాలకు తరలివచ్చారు. దీంతో ఆలయ తిరువీధులు, ఆర్జిత సేవా మండపాలు భక్తనులతో కోలాహలంగా మారాయి. కొండకింద కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి స్వామివారి దర్శనాల కోసం ఉచిత బస్సుల్లో తరలివచ్చారు. ఉభయ దర్శనాల క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండి ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు. స్వామివారి ధర్మదర్శనాలకు సుమారు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19.38లక్షల ఆదాయం సమకూరిందని, ఉదయం, సాయంత్రం రెండు దఫాలుగా కొనసాగిన బ్రేక్ దర్శనాల్లో సుమారు 1,337 మంది భక్తులు ఇష్టదైవాన్ని దర్శించుకున్నట్టు దేవస్థాన అదికారులు తెలిపారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ యాత్రాజనుల రద్దీ నెలకొంది. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.47,39,167ల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.
శాస్త్రోక్తంగా నిత్యారాధనలు
యాదగిరివాసుడికి నిత్యారాధనలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భాలయంలోని స్వయంభువులను, ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చనలు జరిపారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడి నిత్య పూజలు శైవాగమ పద్ధతిలో వైభవంగా కొనసాగాయి. సాయంత్రం ప్రధానాలయంలో అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో నిర్వహించారు.
సౌకర్యాల లేమి.. భక్తుల పాట్లు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శనకు వచ్చిన భక్తులకు కొండపైన సౌకర్యాల లేమి ఇబ్బందులకు గురిచేసింది. కొండపైన సేద తీరే ప్రదేశాలు లేకపోవడంతో పాటు మరుగుదొడ్లు ఎక్కడ ఉన్నయే తెలియక పాట్లు పడుతున్నారు. కొండకింద కింద తులసీకాటేజ్, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంతాల్లో నిద్ర చేసిన భక్తుల సెల్‌ఫోన్లు, విలువైన వస్తవులను దొంగలు ఎత్తుకుపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువరు భక్తులు స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇటీవల యాదగిరిక్షేత్రానికి మూడంచెల భద్రత కల్పిస్తూ ఏఆర్ బలగాలను కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా వీరంతా కొండపైన క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులను క్రమబద్దీకరించే పనుల్లో నిమగ్నమయ్యారని, కొడకింద తులసీకాటేజ్, వైకుంఠద్వారం, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంతాల్లో భద్రతను నిర్వహించాలని భక్తులు, కోరుతున్నారు.