Dornakal- Miryalaguda: డోర్నకల్‌- మిర్యాలగూడ రైలు మార్గానికి ఎఫ్‌ఎల్‌ఎస్‌ మంజూరు

ABN , First Publish Date - 2023-09-07T13:23:23+05:30 IST

డోర్నకల్‌ జంక్షన్‌ నుంచి మిర్యాలగూడ వరకు నేలకొండపల్లి మీదుగా చేపట్టనున్న కొత్త రైల్వే మార్గానికి రైల్వేశాఖ నుంచి ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్)ను

Dornakal- Miryalaguda: డోర్నకల్‌- మిర్యాలగూడ రైలు మార్గానికి ఎఫ్‌ఎల్‌ఎస్‌ మంజూరు

- 120 కిలోమీటర్ల మార్గానికి రూ.2,160కోట్ల అంచనా వ్యయం

- నేలకొండపల్లి, కోదాడ మీదుగా కొత్త లైనుకు చకచకా అడుగులు

ఖమ్మం: డోర్నకల్‌ జంక్షన్‌ నుంచి మిర్యాలగూడ వరకు నేలకొండపల్లి మీదుగా చేపట్టనున్న కొత్త రైల్వే మార్గానికి రైల్వేశాఖ నుంచి ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్)ను మంజూరు చేసింది. సుమారు 120కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనున్న ఈ కొత్త లైను కోసం రూ.2,160కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని రైలు మార్గాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు 15 కొత్త మార్గాలను మంజూరు చేసింది. అందులో భాగంగా డోర్నకల్‌- మిర్యాలగూడెం((Dornakal- Miryalaguda)) కొత్త రైల్వే ప్రాజెక్టు కోసం కసరత్తు చేపట్టింది. డోర్నకల్‌ - మిర్యాలగూడ రైలుమార్గం.. రాజధాని నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, న్యూఢిల్లీకి అనుసంధానమవుతుందని, తద్వారా రవాణా సులభతరమవుతుందని ప్రకటించింది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్‌ నుంచి త్వరలో నిర్మాణం కానున్న యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ వరకు బొగ్గును, సూర్యాపేట జిల్లా నుంచి ధాన్యం, బియ్యం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ముదిగొండ ప్రాంతాల్లోని గ్రానైట్‌ పరిశ్రమలు, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని సిమెంట్‌ పరిశ్రమల నుంచి సరుకును దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసే సౌలభ్యం కలుగుతుంది. అలాగే రాజేశ్వరపురం, సూర్యాపేట ప్రాంతాల్లోని షుగర్‌ ఫ్యాక్టరీల నుంచి చెక్కర, చెరకు రవాణాకు దోహదపడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది.

రైలు లైనులో పలు మార్పులు..

డోర్నకల్‌ మిర్యాలగూడెం లైను ప్రతిపాదన పాతదే అయినా గతంలో నేలకొండపల్లి మీదుగా నిర్మించాలన్న ప్రస్తావన లేదు. కానీ హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల మీదుగా లైన్‌ వేయాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Nalgonda MP Uttam Kumar Reddy) చేసిన వినతులకు సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ డోర్నకల్‌ నుంచి మహబూబాబాద్‌, ఖమ్మంజిల్లాలోని ఖమ్మంరూరల్‌, ముదిగొండ, రాజేశ్వరపురం, నేలకొండపల్లి, ముదిగొండ, సూర్యాపేట(Mudigonda, Suryapet) జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడెం వరకు సర్వేకు ఆమోదం తెలిపింది. అయితే కొన్ని మండలాల్లో రైతులు గ్రామస్థులు సర్వేను పూర్తిగా అడ్డుకున్నారు. 2014లోనే దీనికి సంసిద్ధత వ్యక్తం చేసిన రైల్వేశాఖ ఆ తర్వాత 2021లో అక్టోబరు 2న మళ్లీ ప్రతిపాదన చేసింది. దీంతో ప్రతిపాదిత రైలుమార్గం సర్వేకోసం 2021 ఏప్రిల్‌ 1న ఆమోదించిన రైల్వేశాఖ టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

mmmm.jpg

కొత్తగూడెం- కిరండోల్‌ మార్గానికి కూడా..

కొత్తగూడెం నుంచి ఛత్తీస్‏గఢ్‌లోని కిరండోల్‌ వరకు కూడా రైల్వేమార్గానికి రూ.3240 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించింది. మొత్తం 180 కిలోమీటర్ల మేర తెలంగాణ, ఛత్తీస్‏గఢ్‌ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మించే ఈ రైలుమార్గం ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దీనికి కూడా తుది ఏరియా సర్వే కోసం రూ.3240 కోట్లను కేటాయించింది. దీంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‏గఢ్‌ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలతో అనుసంధానం కానుంది. తద్వారా రాష్ట్రం నుంచి ఒడిశాకు ప్రజా, పారిశ్రామిక రవాణా సులభతరం కానుంది.

Updated Date - 2023-09-07T13:23:23+05:30 IST