MLC Kavitha ED Enquiry: నేడు మరోసారి ఈడీ విచారణకు కవిత
ABN , First Publish Date - 2023-03-16T03:48:38+05:30 IST
ఢిల్లీ మద్య కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో శనివారం ఆమెను దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
పిళ్లై, బుచ్చిబాబును
ముఖాముఖి ప్రశ్నించిన ఈడీ
వారితో కలిపి ఆమెను ప్రశ్నించే చాన్స్
అరెస్టుపై బీఆర్‌ఎస్ వర్గాల ఆందోళన
ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, పార్టీ నేతలు
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్య కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో శనివారం ఆమెను దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అప్పుడే గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని కవితకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 11.30 గంటలకు కవిత ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. మరోవైపు బుధవారం ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబులను ముఖాముఖి కూర్చోబెట్టి.. ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధ్రువీకరింపజేసినట్లు సమాచారం. గతంలో కవిత తరఫున తాను బినామీగా వ్యవహరించినట్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పిళ్లై కోర్టులో పిటిషన్ వేసినందున.. ఆయన తప్పించుకోలేని విధంగా బుచ్చిబాబు ఇచ్చిన సాక్ష్యాలతో ధ్రువీకరించేందుకు ఈడీ ప్రయత్నించింది. ఈ క్రమంలో కవిత విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. పిళ్లైతో తనకు సంబంధం లేదని కవిత చెప్పినా.. వారిద్దరినీ ముఖాముఖి ప్రశ్నించి వాస్తవాలను రాబట్టేందుకు ఈడీ ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా ఆమెను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.
మనీశ్ సిసోడియా కస్టడీ ఈ నెల 17న, పిళ్లై కస్టడీ గురువారంతో ముగుస్తున్నందున కవిత పాత్రను తేల్చేందుకు ఈడీ ప్రయత్నించవచ్చని సమాచారం. ఈ పరిణామాలను ఊహించినందువల్లే కవిత బుధవారం సుప్రీంకోర్టు తలుపుతట్టి తనపై ఈడీ విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆమె పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు అంగీకరించకపోవడం, స్టేకు నిరాకరించడంతో ఆమె ప్రయత్నాలకు విఘాతం కలిగినట్లయింది. దీంతో విషయం చాలా సీరియ్‌సగా మారే అవకాశం ఉందని, గురువారం కవిత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, గత వారం మహిళా రిజర్వేషన్ పేరుతో ధర్నా నిర్వహించి పార్టీ కార్యకర్తలను సమీకరించిన కవిత ఈ సారి కూడా అదే పంథాను అనుసరించారు. బుధవారం ఢిల్లీలోని మెరిడియన్ హోటల్‌లో మహిళా రిజర్వేషన్‌పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కవితకు సంఘీభావంగా మళ్లీ ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివా్‌సగౌడ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే వెంటనే రాజకీయ కార్యాచరణకు వారు సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే కవితను గురువారమే అరెస్టు చేస్తారా, మరోసారి పిలిపించిన తర్వాత అరెస్టు చేస్తారా? అన్న విషయంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలోని పెద్దలతో కొందరు మఽధ్యవర్తుల ద్వారా మాట్లాడించి పరిస్థితి మరింత విషమించకుండా చూసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, అంతా సవ్యంగా జరిగితే అరెస్టు ఉండకపోవచ్చునని కూడా చర్చ జరుగుతోంది.
అనేక ప్రశ్నలు..
గత వారం కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో పాత్ర ఏమిటి? మద్యం వ్యాపారి పిళ్లై మీకు బినామీయా? కాదా? ఇండో స్పిరిట్స్‌లో 32.5ు వాటాలతో పాటు పెర్నాడ్ రికార్డ్ పంపిణీదారుగా కూడా ఉన్నారా? సౌత్ గ్రూప్‌లో వాటా ఎంత? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హవాలా ద్వారా ఢిల్లీకి పంపిన డబ్బు లు ఎవరివి? ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో మద్యం వ్యాపారులు, ఆప్ నేతలతో సమావేశమయ్యారా? అక్కడ సిసోడియా, విజయ్ నాయర్‌లను కలుసుకున్నారా? పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆప్‌కు నిధు లు అందించారా? ఇండో స్పిరిట్స్ యజమాని సమీ ర్ మహేంద్రును కలుసుకున్నారా? లేదా? దాదాపు పది ఫోన్లను ఎందుకు మార్చాల్సి లేదా ధ్వంసం చేయాల్సి వచ్చింది? హైదరాబాద్‌లోని హోటల్‌లో అభిషేక్, బుచ్చిబాబు తదితరులు విజయ్ నాయర్‌తో మీ ఆదేశాలతోనే చర్చలు జరిపారా?.. ఇలాం టి అనేక ప్రశ్నలను సంధించినట్లు సమాచారం. చాలా ప్రశ్నలకు కవిత తనకు తెలియదని చెప్పడంతో ఈ సారి మరిన్ని సాక్ష్యాలతో ఆమెను నిలదీసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.