Delhi Liquor Scam: ఢిల్లీలో రేపు కవిత దీక్ష.. ఈడీ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ..
ABN , First Publish Date - 2023-03-08T21:28:03+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) 10వ తేదీ విచారణ నుంచి మినహాయింపునివ్వాలన్న ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిపై ఈడీ (ED) గురువారం ఉదయం స్పందించే అవకాశం ఉంది.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) 9వ తేదీ విచారణ నుంచి మినహాయింపునివ్వాలన్న ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిపై ఈడీ (ED) గురువారం ఉదయం స్పందించే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్‌లో విచారణకు రావాలంటూ బుధవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఈడీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. మార్చి 9న ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే ముందుగా అనుకున్న కార్యక్రమాల వల్ల ఈడీ విచారణకు రాలేనని కవిత విజ్ఞప్తి చేశారు. 15వ తేదీన వస్తానని లేఖలో కోరారు. అయితే ఈడీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆమె ఢిల్లీ వెళ్లారు. అయితే రాజకీయపరమైన కారణాలతో మినహాయింపు కోరితే సహజంగా అవకాశం ఉండదని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కవిత విజ్ఞప్తిని ఈడీ ఈ రోజే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండేది. కానీ బుధవారం హోళీ సెలవుదినం కావడంతో అధికారులు అందుబాటులో లేరు. అందువల్ల కవిత లేఖపై రేపు ఉదయం ఈడీ స్పందించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
రేపు జంతర్‌మంతర్‌లో దీక్ష
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌తో ఈ నెల 10న ఢిల్లీ (Delhi)లో జంతర్‌మంతర్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అందుకే ఒక ముందే దీక్ష కార్యక్రమ ఏర్పాట్ల కోసం కవిత ఢిల్లీ వెళ్లారు. అయితే కవిత ఉద్దేశం ఒకలా ఉంటే.. ఆమె ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్లే ముందు తన తండ్రి సీఎం కేసీఆర్‌తో భేటీ అవ్వాలని భావించారు. కానీ.. సమయం లేకపోవడంతో కవితకు ఫోన్ చేసిన కేసీఆర్ సుమారు 15 నిమిషాలపాటు మాట్లాడారు. ఈడీ నోటీసులు, న్యాయ సలహాలపై చర్చించాక కవిత ఢిల్లీకి బయలుదేరిందని అంటున్నారు.