Naveen Case: హరిహరకృష్ణ పారిపోకుండా కాళ్లకు బేడీలు..

ABN , First Publish Date - 2023-03-03T17:04:13+05:30 IST

నవీన్‌ హత్య కేసు (Naveen case)లో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీ (Custody)లోకి తీసుకున్నారు.

Naveen Case: హరిహరకృష్ణ పారిపోకుండా కాళ్లకు బేడీలు..

హైదరాబాద్: నవీన్‌ హత్య కేసు (Naveen case)లో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీ (Custody)లోకి తీసుకున్నారు. హరిహరకృష్ణను చర్లపల్లి జైలు (Charlapally Jail) నుంచి సరూర్‌నగర్ సీసీఎస్ ఆఫీస్‌‌కు (Sarurnagar CCS Office) తీసుకెళ్లారు. నిందితుడు పారిపోకుండా కాళ్లకు బేడీలు వేసి విచారణకు తీసుకురావడం గమనార్హం. కాగా హరిహరలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని సమాచారం.

ఇక దర్యాప్తులో భాగంగా నిందితుడిని పోలీసులు 7 రోజులపాటు ప్రశ్నించనున్నారు. అయితే నవీన్ హత్య కేసులో వెలుగుచూసిన విషయాలు మాత్రమే కాకుండా ఇంకా రహస్యాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నిందితుడితో పాటు అతడికి కొందరు సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హత్య జరిగిన తర్వాత నిందితుడు ఓ స్నేహితుడి ఇంట్లో సేదతీరడం, మరో స్నేహితుడితో ఫోన్ మాట్లాడి డ్రగ్స్, గంజాయి గురించి చర్చించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నవీన్‌ హత్య విషయాన్ని హరిహరకృష్ణ తన తండ్రికి చెప్పాడు. విషయం తెలుసుకున్న తండ్రి.. హరిహరను లొంగిపొమ్మని చెప్పినా.. నిందితుడు వారం రోజులు తప్పించుకుని తిరిగాడు. ఆ సమయంలో ఏం చేశాడు? ఎవరెవరిని కలిశాడు? అనే విషయాలపై పోలీసులు గురిపెట్టారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఎన్నో విషయాలు వెలుగుచూస్తాయని భావించిన పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ కీలకం కానుంది. హత్యలో స్నేహితుల పాత్ర, ట్రయాగింల్ లవ్ స్టోరీ (Triangle Love Story)లో యువతి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. హరిహరకృష్ణతో పాటు అతడి స్నేహితులను కూడా ఏకకాలంలో విచారించే అవకాశాలున్నాయి.

యువతితో ప్రేమ విషయంలో కిరాతకుడిగా మారి.. నవీన్‌ను హరిహరకృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా హరిహరకృష్ణతో పరిచయమైంది. మంచి స్నేహితులయ్యారు. తొలుత నవీన్‌కు సమీప కళాశాలలో చదివే యువతితో పరిచయమై.. అది ప్రేమగా మారింది. ఈ విషయం హరిహరకృష్ణకూ తెలుసు. నవీన్‌ బీటెక్‌ కోసం నల్లగొండలోని ఎంజీఎం కళాశాలలో, హరి పీర్జాదిగూడలోని కళాశాలలో చేరారు. నవీన్‌ నల్లగొండకు వెళ్లాక యువతితో దూరం పెరిగింది. ఇదే అదునుగా యువతితో హరి స్నేహం పెంచుకుని, ప్రేమించాడు. ఇది తెలిశాక నవీన్‌ కూడా ఆమెకు టచ్‌లోకి వచ్చాడు. దీన్ని తట్టుకోలేని హరి యువతిని దక్కించుకోవాలని, నవీన్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారమే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం హరి చర్లపల్లిలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

Updated Date - 2023-03-03T17:22:02+05:30 IST