Naveen Case: పోలీస్ కస్టడీకి హరిహరకృష్ణ
ABN , First Publish Date - 2023-03-02T17:17:50+05:30 IST
అబ్దుల్లాపూర్మెట్ నవీన్ హత్య కేసు (Naveen case)లో నిందితుడు హరిహరకృష్ణను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. హరిహరకృష్ణను వారం పాటు కస్టడీ..
హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ నవీన్ హత్య కేసు (Naveen case)లో నిందితుడు హరిహరకృష్ణను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. హరిహరకృష్ణను వారం పాటు కస్టడీ (Custody)కి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. ఈ కేసు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు (Abdullahpurmet Police) దర్యాప్తు చేస్తున్నారు. నవీన్ హత్య ఘటనా స్థలంలో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. యువతితో ప్రేమ విషయంలో కిరాతకుడిగా మారి.. నవీన్‌ను హరిహరకృష్ణ దారుణంగా హత్య చేశాడు. నవీన్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా హరిహరకృష్ణతో పరిచయమైంది. మంచి స్నేహితులయ్యారు. తొలుత నవీన్‌కు సమీప కళాశాలలో చదివే యువతితో పరిచయమై.. అది ప్రేమగా మారింది. ఈ విషయం హరిహరకృష్ణకూ తెలుసు. నవీన్ బీటెక్ కోసం నల్లగొండలోని ఎంజీఎం కళాశాలలో, హరి పీర్జాదిగూడలోని కళాశాలలో చేరారు. నవీన్ నల్లగొండకు వెళ్లాక యువతితో దూరం పెరిగింది. ఇదే అదునుగా యువతితో హరి స్నేహం పెంచుకుని, ప్రేమించాడు. ఇది తెలిశాక నవీన్ కూడా ఆమెకు టచ్‌లోకి వచ్చాడు. దీన్ని తట్టుకోలేని హరి యువతిని దక్కించుకోవాలని, నవీన్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారమే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం హరి చర్లపల్లిలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.