Share News

Hyderabad: అన్ని పార్టీలు జూబ్లీహిల్స్‌ వైపే.. పట్టు సాధించేందుకు ఎత్తుగడలు

ABN , First Publish Date - 2023-11-16T09:35:55+05:30 IST

జూబ్లీహిల్స్‌(Jubilee Hills) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌

Hyderabad: అన్ని పార్టీలు జూబ్లీహిల్స్‌ వైపే.. పట్టు సాధించేందుకు ఎత్తుగడలు

- లోటుపాట్టపై చర్చలు

బంజారాహిల్స్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌(Jubilee Hills) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం, బీజేపీ(BRS, Congress, MIM, BJP)లు కొత్త ఎత్తుగడలు వేస్తూ నియోజకవర్గం పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం కావడంతో సీనియర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి ఓటు బ్యాంక్‌లను కొల్లగొట్టేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. తాజాగా రెహ్మత్‌ నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌రెడ్డి బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్‏లో చేరడం.. గత ఎన్నికల్లో ప్రభావం చూపించిన స్వతంత్ర అభ్యర్థి నవీన్‌యాదవ్‌ ఈ సారి బరి నుంచి తప్పుకోవడం వంటి అంశాలు ఎవరికి మేలు చేస్తాయనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. లోటు పాట్లను ఎలా అధిగమించాలనే అంశాలపై చర్చిస్తున్నారు.

బరిలో 19 మంది అభ్యర్థులు

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మొత్తం 38 మంది నామినేషన్‌లు వేయగా, 18 తిరస్కరణకు గురయ్యాయి. బుధవారం స్వతంత్ర అభ్యర్థి నవీన్‌యాదవ్‌ నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 19 మంది నిలిచారు. బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి గోపీనాథ్‌, కాంగ్రెస్‌ నుంచి మహ్మద్‌ అజారుద్దీన్‌, బీజేపీ నుంచి లంకెల దీపక్‌రెడ్డి, ఎంఐఎం నుంచి మహ్మద్‌ రషీద్‌, బీఎస్సీ నుంచి కోనేటి సుజాత, ఇండియా ప్రజా కాంగ్రెస్‌ నుంచి జి.చెన్నారెడ్డి, పాట పార్టీ నుంచి వెంకట్‌రెడ్డి, సమైఖ్యాంధ్ర సమితి నుంచి జి.శ్రీకాంత్‌, స్వతంత్రులుగా సూదిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సురభీసింగ్‌, ఇస్మాయిల్‌ ఖాన్‌, సిద్దార్థ చక్రవర్తి, రాంబాబు వనపర్తి, మహ్మద్‌ అక్బరుద్దీన్‌, ఆనంద్‌, షేక్‌ షరీఫ్‌, షేక్‌ కరీంలు బరిలో ఉన్నారు.

చేరికలతో ఎవరికి లాభం..?

ఎన్నికల సమయంలో పార్టీలు మారే వారు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు, తమ బలాన్ని పెంచుకునేందుకు కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. తాజా ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శిబిరంలోని రెహ్మత్‌నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి కాంగ్రె్‌సలో చేరారు. అతడి చేరికతో డివిజన్‌లో తమ బలం పెరిగిందని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి. బీఆర్‌ఎస్‌ మాత్రం అలాంటిది ఏం లేదని 69 బూత్‌లకు చెందిన వారంతా తమ శిబిరంలోనే ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య జరుగుతున్న అంతర్‌ యుద్ధం అనుకూలంగా మార్చుకునేందుకు ఎంఐఎం, బీజేపీ కుయుక్తులు పన్నుతున్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‏కు చెందిన మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి చేరికతో బీఆర్‌ఎ్‌సకు అదనపు బలం చేకూరిందని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. సంప్రదాయ ఓటు బ్యాంక్‌తోపాటు దివంగత పీజేఆర్‌ ఓట్లు కలిసి వస్తాయని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తుంది. ఎంత బేరీజు వేసుకున్నా ప్రజల నాడి ఎవరు పట్టుకోలేరని విశ్లేషకులు చెబుతున్నారు.

hyd4.jpg

ఆ ఓట్లు ఎవరికో..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందగా కాంగ్రెస్‌ రెండో స్థానం, స్వతంత్ర అభ్యర్థి నవీన్‌యాదవ్‌ మూడో స్థానం, బీజేపీ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి పి.విష్ణువర్ధన్‌రెడ్డికి సంప్రదాయ ఓటు బ్యాంక్‌తో పాటు పీజేఆర్‌ వర్గం ఓట్లు కూడా తోడయ్యాయి. టీడీపీ మద్దతు ఇచ్చింది. ఇలా అందరి సహకారంతో విష్ణుకు 52,880 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు 18 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ బరిలో లేరు. కాంగ్రెస్‌ తరఫున క్రికెటర్‌ అజారుద్దీన్‌కు టికెట్‌ రావడంతో విష్ణు బీఆర్‌ఎస్‏లో చేరారు. నవీన్‌యాదవ్‌ ప్రస్తుత ఎన్నికల్లో నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకొని కాంగ్రె్‌సకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో విష్ణు, నవీన్‌కు పోలైన ఓట్లు ఈసారి ఎవరికి పడతాయనేది ప్రశ్నార్థకం.

Updated Date - 2023-11-16T10:50:31+05:30 IST