TS News: అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్‌పై హైదరాబాద్ సీపీ కీలక ప్రెస్‌మీట్
ABN , First Publish Date - 2023-11-11T16:06:30+05:30 IST
సోషల్ మీడియాలో ప్రొఫైల్‌కి లాక్ పెట్టుకొండి. అపరిచితుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించవద్దు. ప్రొఫైల్‌ని రెండు దశలుగా సెక్యూర్ పెట్టుకోండి. స్నేహితులు, అపరిచితులతో వీడియో కాలింగ్ చేయొద్దు.
హైదరాబాద్: తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నిందితుల నుంచి 1464 నైట్రావెట్ మాత్రలు (సైకోట్రోపిక్ డ్రగ్స్), రెండు మొబైల్ ఫోన్‌లు సీజ్ చేశాం. ప్రధాన నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిర్జు ఉపాధ్యాయపై బీదర్‌లో రౌడీషీట్ ఉంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన బిర్జు ఉపాధ్యాయ్‌తో పాటు కుటుంబం గత 14 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ నైట్రావెట్ మాత్రలు విక్రయిస్తుంది. మరో నిందితుడు కిషన్ విట్టల్ రావ్ కాంబ్లే.. బిర్జు ఉపాధ్యాయ్‌కు అసోసియేట్‌గా వ్యవహరిస్తున్నాడు. గుల్బర్గాకు చెందిన సుప్రీత్ నవలే అనే వ్యక్తి నుంచి బిర్జు ఉపాధ్యాయ్ మాత్రలు కొనుగోలు చేస్తాడు. ఒక్కో నైట్రావెట్ మాత్రల బాక్స్‌ను 2 వేల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని డ్రగ్స్ పెడ్లర్లకు రూ. 5,500 అక్రమంగా విక్రయించారు. బిర్జు తన బంధువైన రాను భాయి అనే వ్యక్తికి టాబ్లెట్స్ ఇచ్చి కర్ణాటక నుంచి హైదరాబాద్ పంపాడు. ఈ టాబ్లెట్స్‌ను మాంగర్ బస్తీలో నివాసం ఉంటున్న రాజు మరియు పల్లవి అనే తన బంధువులకు సరఫరా చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నిందితుడు రాను భాయి కర్ణాటక నుంచి నైట్రావెట్ ట్యాబ్లెట్‌లను తీసుకుని ఎంజీబీఎస్‌లో బస్సు దిగాడు. నైట్రావెట్ మాత్రలను మాంగేర్ బస్తీలోని హబీబ్‌నగర్‌కు తీసుకెళ్తూ ఉండగా టీఎస్ న్యాబ్, అఫ్జల్‌గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల ఇంటిపై ఈ నెల నాలుగో తేదీన తెల్లవారుజామున పోలీసులు రైడ్ చేశారు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఒక్కసారిగా పోలీసులపై దాడి చేశారు. దాడిలో ఒక ఎస్‌ఐ, కానిస్టేబుల్ తలకు గాయాలయ్యాయి. తల్లిదండ్రులందరూ తమ పిల్లలు మరియు వారి కార్యకలాపాలపై జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైన టాబ్లెట్ల గురించి వారికి అవగాహన ఉండాలి.’’ అని సీపీ సూచించారు.
మహిళలకు సూచన..
‘‘సోషల్ మీడియాలో ప్రొఫైల్‌కి లాక్ పెట్టుకొండి. అపరిచితుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించవద్దు. ప్రొఫైల్‌ని రెండు దశలుగా సెక్యూర్ పెట్టుకోండి. స్నేహితులు, అపరిచితులతో వీడియో కాలింగ్ చేయొద్దు. ముఖ్యంగా ఆడవాళ్లను ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. ఎవరైనా బ్లాక్ మెయిల్, ఒత్తిడి చేస్తే ఆందోళన చెందొద్దు. నేరుగా మా నెంబర్లను 9490616555, 871266001 సంప్రదించండి. సోషల్ మీడియాపై జాగ్రత్తలు వహించండి. చిన్న పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై ఎవరైనా వేధింపులకు గురైతే కఠిన చర్యలు తీసుకుంటాం. నేరుగా ఫోన్, మెసేజ్ ద్వారానైనా సంప్రదించండి. బాధితులకు 100 శాతం న్యాయం చేస్తాం. అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా డ్రగ్స్ కి బానిస అవుతున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ని కంట్రోల్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తున్నాం. మహిళలకు షీ టీమ్ అండగా ఉంటుంది.’’ అని సీపీ మహిళలకు భరోసా ఇచ్చారు.