Organ Transportation : రికార్డు సమయంలో ఊపిరితిత్తుల రవాణా.. ట్రాఫిక్ పోలీసుల కృషికి ప్రశంసల జల్లు..
ABN , First Publish Date - 2023-06-27T20:15:54+05:30 IST
ప్రజల ప్రాణాలను కాపాడటంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రాణాలను నిలిపే చికిత్స కోసం అవసరమైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాలను సురక్షితంగా, సకాలంలో రవాణా చేయడానికి సహకరిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో అందిస్తున్న ఈ చేయూతకు అందరి మన్ననలు లభిస్తున్నాయి.
హైదరాబాద్ : ప్రజల ప్రాణాలను కాపాడటంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రాణాలను నిలిపే చికిత్స కోసం అవసరమైన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాలను సురక్షితంగా, సకాలంలో రవాణా చేయడానికి సహకరిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో అందిస్తున్న ఈ చేయూతకు అందరి మన్ననలు లభిస్తున్నాయి. వీరి సహాయంతో ప్రాణాలు నిలుపుకున్నవారు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఊపిరితిత్తులను రికార్డు సమయంలో ఆసుపత్రికి చేర్చడంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం అందజేసిన సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు పోలీసు కమిషనర్ జీ సుధీర్ బాబు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తులను సురక్షితంగా రవాణా చేశారు. దీని కోసం హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో ఈ మార్గంలో గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేశారు. 35.3 కిలోమీటర్ల దూరంలోని గమ్య స్థానాన్ని కేవలం 27 నిమిషాల్లో చేరుకుని, ఊపిరితిత్తులను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చగలిగారు. విమానాశ్రయం నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.12 గంటలకు బయల్దేరిన మెడికల్ టీమ్ కిమ్స్ ఆసుపత్రికి మధ్యాహ్నం 2.39 గంటలకు చేరుకోగలిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, మెహిదీపట్నం, లకడీకాపూల్, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, ట్యాంక్‌బండ్, రాణీగంజ్ మీదుగా ఈ ప్రయాణం జరిగింది.
ప్రాణాలను నిలిపే ఊపిరితిత్తులను సురక్షితంగా, సకాలంలో చేర్చగలిగినందుకు ట్రాఫిక్ పోలీసులను కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది, ప్రశంసించింది. ట్రాఫిక్ పోలీసులు 2023లో తొమ్మిదిసార్లు అవయవాల సురక్షిత రవాణాకు ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి :
Putin Offer: వాగ్నర్ గ్రూప్ సైనికులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే...?
Opposition unity : ప్రతిపక్షాల ఐక్యతపై మోదీ వ్యాఖ్యలు