SFC funds: బిల్లులిస్తారో.. ముంచుతారో
ABN , First Publish Date - 2023-08-16T02:41:10+05:30 IST
ఇది కేవలం ఒకరిద్దరి సర్పంచ్‌ల(Sarpanches) ఆవేదనే కాదు.. తెలంగాణ (Telangana) లో దాదాపు అన్ని గ్రామాల సర్పంచ్‌లదీ! గ్రామ పంచాయతీలు(Village Panchayats) నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్నాయి.
రూ.1840 కోట్లు ఎస్‌ఎఫ్‌సీ నిధుల పెండింగ్..
అభివృద్ధి పనుల డబ్బులూ రాలేదు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ సర్పంచుల్లో ఆందోళన
మరో ఐదు నెలల్లో ముగియనున్న వారి పదవీ కాలం
బకాయి నిధులొచ్చినా వాడుకోలేని పరిస్థితి
మురుగు కాల్వలను తాత్కాలికంగానూ మరమ్మతు చేయలేకపోతున్నాం.. బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకూ పైసల్లేవు.. ఏడాదిగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిధులు పెండింగ్‌లో ఉండటంతో పంచాయతీ నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్న ఆశతో లక్షల్లో అప్పులు చేసి మరీ పనులు చేయించాం. నెలల తరబడి డబ్బులు రాకపోవడంతో.. అప్పులు తీర్చలేక అవస్థ పడుతున్నాం. నున్వానేనా అన్నట్టుగా సాగిన ఉప ఎన్నిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన మునుగోడు గ్రామ పంచాయతీ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలి.
- మునుగోడు సర్పంచ్ వెంకన్న ఆవేదన ఇది
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఇది కేవలం ఒకరిద్దరి సర్పంచ్‌ల(Sarpanches) ఆవేదనే కాదు.. తెలంగాణ (Telangana) లో దాదాపు అన్ని గ్రామాల సర్పంచ్‌లదీ! గ్రామ పంచాయతీలు(Village Panchayats) నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్నాయి. అసలే ఎన్నికల ఏడాది.. దీనికి తోడు మరో అయిదు నెలల్లో సర్పంచుల పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల సంగతేమిటని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు (Pending Bills)చెల్లిస్తుందా? ముంచుతుందా? అన్న అనుమానం రాష్ట్రంలోని సర్పంచుల్లో వ్యక్తమవుతోంది. ఓ వైపు పల్లె ప్రగతి నేపథ్యంలో ప్రజాప్రతినిధుల నోటి మాటతో చేసిన పనులకు డబ్బులు రావడంలేదు. మరోవైపు ప్రభుత్వం ప్రతినెలా ఇవ్వాల్సిన ఎస్‌ఎస్‌సీ నిధుల(SSC Funding) విడుదలకు బ్రేక్ పడుతూ వస్తోంది. నెలల తరబడి నిధులు రాకపోవడంతో.. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ బిల్లులు, మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లించలేక తాము అవస్థ పడాల్సి వస్తోందని రాష్ట్రవ్యాప్తంగా పాలకవర్గాలు ఆరోపిస్తున్నాయి.
‘ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పడంతో సర్పంచులు సొంతంగా రూ.లక్షల్లో అప్పులు చేసి మరీ పనులు చేయించాం.. టార్గెట్లు పెట్టి మరీ వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీరోడ్లు, డ్రైనేజీలు తదితర పనులు చేయించారు. కానీ.. ఏళ్లు గడిచినా వాటికి నిధులు విడుదల కాలేదు. ఖర్చు చేసిన డబ్బులకు వడ్డీలు పెరిగిపోయాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి’ అంటూ పలువురు సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిందంటే ప్రభుత్వం నుండి డబ్బులు రావు. దీనికితోడు 2024 జనవరి నాటికి (మరో అయిదు నెలల్లో) మా పదవీకాలం పూర్తవుతుంది. ఈ రెండు నెలల్లోనే తమకు రావాల్సిన బిల్లులను చెల్లించాలని పలువురు సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి పంచాయతీల్లో పనులు చేయాలంటే నిర్దిష్ట నిబంధనలు పాటించాలి. తొలుత పంచాయతీ అనుమతి పొంది.. వాటికి అంచనాలు సిద్ధంచేశాక ప్రభుత్వానికి వాటికి అనుమతులు జారీ చేస్తుంది. ఆ తర్వాత టెండరు ప్రక్రియ ద్వారా పనులు చేపట్టాలి. పనులు పూర్తయ్యాక ఎంబీ రికార్డులు నమోదు చేసి దశలవారీగా బిల్లులు విడుదల చేస్తారు. కానీ.. కేవలం మౌఖిక ఆదేశాలతోనే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో పనులు చేయించారు.
నిధులొచ్చినా.. వాడుకోలేని పరిస్థితి..!
రాష్ట్రంలోని చాలా గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె ప్రగతి నేపథ్యంలో చేపట్టిన ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను సర్పంచులు సొంత డబ్బులతో చేయించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు గాను.. సగానికి పైగా గ్రామాల సర్పంచులు అప్పులు చేసి మరీ పనులు చేపట్టారు. అలా మధ్యలో కొంత మొత్తంలో ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా.. నేటికీ చాలా గ్రామాల్లో రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు బిల్లుల బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సర్పంచుల్లో అసంతృప్తిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా.. అవి సకాలంలో అందే పరిస్థితి కనబడటం లేదు. మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో నిధులు మంజూరు చేసినా.. అవి ఆర్థిక శాఖ ఆమోదంతో.. దశలవారీగా సర్పంచులకు చేరేందుకు సమయం పడుతుందని.. అలా కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడితేనే తాము అప్పుల ఊబి నుంచి బయట పడతామని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు.
8 నెలల నిధులు పెండింగ్..!
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు నెలల తరబడి రాకపోవడంతో పంచాయతీల్లోని పారిశుద్ధ్య సిబ్బంది వేతనాల చెల్లింపూ కష్టంగా మారింది. ప్రతినెలా ట్రాక్టర్ ఈఎంఐలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు సైతం భారంగా మారింది. పలు గ్రామాల్లో సకాలంలో విద్యుత్ బిల్లు చెల్లించలేదని.. అధికారులు ఒత్తిడి తెచ్చి మరీ.. సర్పంచులు, గ్రామ కార్యదర్శుల ద్వారా వారి సొంత డబ్బులతో తాత్కాలికంగా బిల్లు కట్టిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఎస్‌ఎ్‌ఫసీ కింద ప్రతి నెలా రూ.230 కోట్లకు పైగా విడుదల చేయాల్సి ఉంటుంది. 2022 ఆగస్టు వరకు పంచాయతీల ఖాతాల్లో నిధులు జమచేసిన సర్కారు.. ఆ తర్వాత పెండింగ్ పెడుతూ వస్తోంది. ఇందులో సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో నిధులు విడుదల చేయకుండా.. నవంబరు మాసంలో మాత్రం పంచాయతీలకు నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత 2023 మార్చిలో విడుదల చేసినప్పటికీ.. అవి సగం మాత్రమే విడుదల చేశారని సంబంధిత విభాగాలు చెబుతున్నాయి. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 8 నెలలకు సంబంధించిన ఎస్‌ఎ్‌ఫసీ నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు, 2023లో జనవరి, పిబ్రవరి, ఏప్రిల్, మే.. కలిపి మొత్తం 8 నెలలకు సంబంధించి మొత్తం దాదాపు రూ.1840 కోట్లు కోట్లమేర ఎస్‌ఎ్‌ఫసీ నిధులు విడుదల చేయాల్సి ఉంది. నెలల తరబడి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో.. గ్రామ పంచాయతీల్లో కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. రోజువారీ నిర్వహణ, ఇతర ఖర్చులకు సైతం కష్టంగా మారిందని సర్పంచులు చెబుతున్నారు.
‘నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆదేశంతో గ్రామాన్ని సుందరీకరించడంతోపాటు
ప్రకృతి వనం, వైకుంఠధామం, సీసీ రోడ్ల నిర్మాణం.. ఇలా అన్ని రకాల పనులు చేపట్టాను. ప్రభుత్వం నిధులివ్వక పోతుందా? అని అప్పులు చేసి మరీ.. అభివృద్ధి పనులు చేయించాను.. రూ.15లక్షల వరకు డబ్బులు వెచ్చిస్తే.. ఇటీవల కొంత విడుదల చేశారు. మరో రూ.8లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు విడుదల చేస్తారోనని ఎదురు చూస్తున్నా’ అంటూ.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పనుల బిల్లుల పెండింగ్‌తోనే సతమతమవుతుంటే.. మరోవైపు ప్రభుత్వం ప్రతినెలా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు నెలల తరబడి పంచాయతీలకు రాకపోవడంతో నిర్వహణకోసం తామంతా అప్పులు చేయాల్సి వస్తోందని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సర్పంచ్ ఒకరు ఆరోపిస్తున్నారు.
‘అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెంటబడి మరీ గ్రామాల్లో పనులు చేయించారు. రూ.10 లక్షల వరకు అప్పులు చేశా. నాలుగేళ్లుగా ఎదురు చూస్తుంటే.. ఈ మధ్యనే రూ.5 లక్షల వరకు పెండింగ్ బిల్లులు విడుదల చేశారు. మరో రూ.5లక్షలు రావాల్సి ఉంది. మా పదవీ కాలం పూర్తికానున్న ఈ 5 నెలల్లో వస్తాయా..? లేదా అన్న భయం వేస్తోంది’ అంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.