Swapnalok Fire Accident: ఏడాదిలో 4 ఫైర్ యాక్సిడెంట్లు... హడావుడి చర్యలు.. పట్టించుకోని అధికారులు
ABN , First Publish Date - 2023-03-17T11:54:58+05:30 IST
సికింద్రాబాద్‌లోని పురాతన భవనం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని పురాతన భవనం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే భాగ్యనగరంలో ఎన్నో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి.. ఆ తరువాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. మళ్లీ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారుల్లో చలనం వస్తుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో నాలుగు పెద్ద అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ నాలుగు ప్రమాదాల్లో మొత్తం 28 మంది మృత్యువాతపడ్డారు. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంది. డెక్కన్ మాల్ ఘటన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు సమావేశాలు ఏర్పాటు చేసి హడావుడి చేశారు. ఆ తర్వాత షరా మామూలే.
అలాగే గతేడాది మార్చి23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో సెప్టెంబర్ 12న ఫైర్ యాక్సిడెంట్ జరుగగా.. ఎనిమిది మంది చనిపోయారు. ఆ తర్వాత 4 నెలల్లోనే మరో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జనవరి 29న డెక్కన్ మాల్లో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనం అయ్యాయి. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న గోడౌన్లను ఖాళీ చేయిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గోడౌన్లపై సర్వే చేసి మరీ రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు. వరుస ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్లోలో కూడా చర్యలు శూన్యం. బిల్డింగ్ ప్రాప్టర్టీ ట్యాక్స్ క్లియర్గా ఉందా? లేదా అని మాత్రమే అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ల కోసం పలుమార్లు తిరుగుతున్నప్పటికీ.. ఆ బిల్డింగ్ వాడకంపై మాత్రం అధికారులు దృష్టి సారించని పరిస్థితి.